Kota Srinivasarao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ విలన్ గానూ కమెడియన్ గానూ అలా అన్ని పాత్రలలోనూ తనదైనా నటనతో అలరించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం వృద్దాప్య బాధలతో ఇబ్బందిపడుతున్నా ఇప్పటికీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు, ఖాళీగా ఉంటే బాగుండదంటూ చెప్తున్న కోటా గారి జీవితంలో జరిగిన చీకటి ఘటన ‘మండలాధీశుడు’ సినిమా వల్ల సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుండి ఎదుర్కొన్న వ్యతిరేకత. ఇక ఆ సినిమా సమయంలో జరిగిన దాడి గురించి కోటా గారు ఇన్నేళ్ల తరువాత మాట్లాడారు.

బెజవాడలో మీద పడి కొట్టారు…
బ్యాంకులో పనిచేస్తూ నటన మీద మక్కువతో సినిమాల్లోకి అడుగుపెట్టిన కోటా శ్రీనివాస్ రావుగారు అటు విలన్ గా ఇటు కమెడియన్ గా కూడా అలరించారు. ఇక ఆయన కెరీర్ మొదట్లోనే 1980 ఆ సమయంలో కృష్ణ గారి సినిమా మండలధీశుడు లో ఎన్టీఆర్ పాత్ర వేశారు కోటా గారు. అప్పుడే ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారి మీద విమర్శనాత్మక చిత్రం అవడం, అందులో కోటా గారు ఎన్టీఆర్ పాత్ర వేయడం వల్ల తీవ్ర వ్యతిరేకత అప్పట్లో ఎదుర్కొన్నారు. కెరీర్ మొదట్లో కావడంతో పోసిటివ్ వస్తే సినిమాలొస్తాయి నెగెటివ్ అయితే నా బ్యాంకు ఉద్యోగానికి నేను వెళ్లిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ సినిమాలో నటించారట.

అయితే ఆ సినిమా వచ్చాక వేరే సినిమా షూటింగ్ కోసం కోదాడ వెళ్లిన కోటా గారు కూతురిని చూడటానికి బెజవాడ వెళ్లారట. బెజవాడ రైల్వే స్టేషన్ లో సరిగా అప్పుడే అటు వైపు ఎన్టీఆర్ గారు అక్కడ పక్కన ప్లాటుఫారం లో ఉండటం ఆయన అభిమానులు చాలా మంది అక్కడ ఉండటంతో ఎవరో కోటా గారిని చూసి ఇక వెంబడించారట. మీద ఎక్కి కొట్టారట. ఆ తరువాత పోలీసులు సర్థిచెప్పడంతో అక్కడి నుండి వాళ్ళందరూ వెళ్లిపోయారట. బాగా దెబ్బలు తిన్న కోటా గారు రిక్షా పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయారట. అలా ఆ సినిమాలో నటించడం వల్ల అలాంటి ఇబ్బందికర ఘటన ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పారు.



























