Langer House murder case: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే ఇక అన్నీ అనుకున్న ఆ మహిళకు భర్త నరకం చూపించాడు. చివరకు అనుమానం అనే వ్యాధికి బానిసైన అతను ఆమెను గొంతు కోసి హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో జరిగింది. తమ తల్లిని తండ్రే చంపడంతో తీవ్రంగా బాధపడుతున్న పిల్లలు తమ తండ్రికి కఠినంగా శిక్షపడాలని కోరుకుంటున్నారు.

అనుమానమే హత్యకు కారణం…
లంగర్ హౌజ్ లో ఉన్న కనీజ్, జహంగీర్ లకు పెళ్ళై 20 ఏళ్లకు పైగా అయింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు ఎంతో సంతోషంగా ఉన్నారని అందరూ భావించినా నిజానికి విషయం వేరే. ఇరవై ఏళ్లుగా భార్యను ఇంట్లోనే బంధించి వీధించేవాడట జహంగీర్. భార్య ఎవరితోనైనా మాట్లాడితే అనుమానం. చివరకు కనీజ్ తన సోదరులతో మాట్లాడినా అనుమానంతో కొట్టేవాడట.

అలా జరుగుతున్న క్రమంలో తాజాగా ఏదో గొడవ జరిగి తాను ముగ్గురు పిల్లలతో కనీజ్ తన సోదరుడి ఇంటికి వెళ్లగా మళ్ళీ జహంగీర్ ఆమె వద్దకు వెళ్లి మాట్లాడి లంగర్ హౌజ్ లోని వారి ఇంటికి తీసుకువచ్చాడు. మళ్ళీ గొడవ జరుగగా ఈసారి ఆమెను గొంతు కోసి చంపేశాడు. తాగుడుకు బానిసైన జహంగీర్ కనీజ్ ను హత్య చేసాడని కనీజ్ తండ్రి, ఆమె సోదరుడు చెప్పగా కనీజ్ కూతురు తన తల్లిని చంపినట్లే తమను కూడా తండ్రి చంపేస్తాడని, తండ్రికి కఠినంగా శిక్షపడాలంటూ, తమ తండ్రి సైకో లాగా మారిపోయాడని తెలిపారు.