Mugguru Kodukulu : కృష్ణ 1942 లోగుంటూరు జిల్లా, తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరు ఆదిశేషగిరిరావు మరొకరు హనుమంతరావు.

కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు చిత్రం కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తన ఫోటోలు పంపించాడు. అలా చిత్రానికి హీరో గా ఎంపికయ్యారు. ఆ తర్వాత గూడచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడులాంటి మనిషి, బుర్రిపాలెం బుల్లోడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, సింహాసనం లాంటి చిత్రాల్లో కృష్ణ విజయ దుందుభి మోగించారు.

ఆయన తల్లి గారైన నాగరత్నమ్మ తనకు కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ముగ్గురు కొడుకులు కావడంతో.. వారి గుర్తుగా “ముగ్గురు కొడుకులు” చిత్రాన్ని ఆమె రిజిస్టర్ చేయించడం జరిగింది. కథ కోసం పద్మాలయ బ్యానర్ ఆస్థాన రచయిత మహారధిని ఒక కథ తయారు చేయమన్నారు. అలా ఏడాది గడిచినా కూడా మహారధి కథ తయారు చేయలేకపోయారు. నాగరత్నమ్మ ఆ విషయాన్ని పెద్ద కుమారుడైన కృష్ణకి చెప్పారు.

ముగ్గురు కొడుకులు టైటిల్ కి తగిన కథ పరుచూరి బ్రదర్స్ చే రాయిస్తానని తన మాతృమూర్తికి హామీ ఇవ్వడం జరిగింది. అలా పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి రిజిస్టర్ చేసిన “ముగ్గురుకొడుకులు” చిత్రానికి తగిన విధంగా ఒక కథ తయారు చేయాలని పరుచూరి బ్రదర్స్ కు చెప్పారు. అలా కొన్ని రోజులకి పరుచూరి బ్రదర్స్ హీరో కృష్ణకి ఓ కథ చెప్పారు. ఎందుకనో ఆ కథ కృష్ణ కి నచ్చలేదు. తర్వాత దర్శకుడు పి.సి.రెడ్డి చెప్పిన లైన్ కృష్ణకు నచ్చడంతో ఊటీ బ్యాక్ డ్రాప్ లో కథ సిద్ధం చేశారు.

ఈ సినిమాకి సంభాషణలు రాసే బాధ్యత పరుచూరిబ్రదర్స్ తీసుకున్నారు. స్కూల్ సెలవులలోనే మహేష్ బాబుతో సినిమా షూటింగ్ జరిపేవారు. ఈ సినిమాలో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా గుమ్మడి, అన్నపూర్ణలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కృష్ణ సరసన గ్లామర్ క్వీన్ రాధ, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనమ్ నటించారు. మహేష్ బాబు ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తాడు. ఆ చిన్న వయసులో పాత్రకు తగిన విధంగా హావభావాలు అద్భుతమైన డైలాగులు మహేష్ బాబు చెప్పడంతో సినిమా యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారు.

పద్మాలయ బ్యానర్ పై కృష్ణ మాతృమూర్తి ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మాణం, కృష్ణ స్వీయ దర్శకత్వంలో 1988, అక్టోబర్ 20 న “ముగ్గురు కొడుకులు” చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించినందుకు తల్లి నాగరత్నమ్మ చాలా సంతోషించారు. కానీ ఈ సినిమా శతదినోత్సవ సమయానికి ఆమె కన్నుమూశారు.
































