Mulugu MLA Seethakka : ఆదివాసీ కోయ జాతికి చెందిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా తెలిసిన వ్యక్తి. ఆమె జీవితం ఖచ్చితంగా ఎందరికో ఆదర్శం. విద్యార్ధి జీవితం నుండే పోరాట జీవితం మొదలు పెట్టిన అనసూయ ఆపైన దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఇక అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఆపైన గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు సామజిక సేవ వైపు సాగింది. ఆపైన రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి పక్షాన నిలిచి పోరాడుతూ నిజమైన ప్రజాసేవకు మార్గం తెలుసుకున్నారు. ఇలా నక్సలైట్ జీవితం నుండి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో ఉన్న ఆమె ప్రస్థానం అందరికీ ఆదర్శమే.

చిన్న వయసులోనే ప్రజాపోరాటంలోకి…
వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క, సమ్మయ్యలకు జన్మించిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న సమయంలోనే అక్కడ సరిగా భోజనం పెట్టడం లేదని అలాగే బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేసింది. ఆలా 13 ఏళ్ల వయసులోనే 1986లో పోరాట జీవితంలోకి అడుగుపెట్టిన సీతక్క పీపుల్స్ వార్ దళం సభ్యుల కంట్లో పడింది. తన సోదరుడు సాంబయ్య కూడా నక్సలైట్ కాగా పోలీసుల చేతిలో మరణించాడు. బావ శ్రీరాముడు దళంలో ఉండటంతో 14 ఏళ్ల వయసులో నక్సలిజంలో చేరినా సీతక్క చదువును వదలలేదు. దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపినప్పుడు జైలులో ఉంటూనే పదోతరగతిలో ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ పాస్ అయింది. ఆపైన ప్రేమించిన తన బావ శ్రీరాముడినే పెళ్లి చేసుకున్న అనసూయ, సీతక్కగా తన పేరును మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తరువాత రెండు నెలల పిల్లాడిని బయట వేరేవాళ్లకు పెంచడానికి ఇచ్చి అడవిలోకి వెళ్లిపోయిన సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం దళంలో పొసగలేక 1996లో బయటికి వచ్చేసిన సీతక్క ఆ తరువాత ఐటిడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.

అలా ‘లా’ చదివిన సీతక్క ఆపైన చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ పార్టీ పట్ల ఆకర్షితురాలై 2004లో అందులో చేరి ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పైన 2009లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య మీద పోటీ చేసి గెలిచారు. ఆలా ఎమ్మెల్యే అయిన సీతక్క నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయములో టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సీతక్క 2017లో కాంగ్రెస్ లోకి చేరారు. 2019 ఎన్నిక్షల్లో గెలిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియని పరిస్థితి. ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితం అయితే తాను మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలో గ్రామాలను తిరుగుతూ ఎంతోమందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేసారు. ఆలా నేడు తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇంచార్జ్ గా ఉంటూనే ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో నిలిచారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ పొందారు. అలా నక్సలైట్ జీవితం నుండి లాయర్ గా మారి ఆపైన ఎమ్మెల్యే అయిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం.





























