Narayana : పొలిటికల్ నాయకులు టంగ్ స్లిప్ అవ్వడం ఆ తరువాత నాలుక కరుచుకోవడం కామనే. అలానే సిపిఐ సీనియర్ నేత నారాయణ. అదికూడా ఒక పొలిటికల్ లీడర్ మీద అయితే పెద్దగా ఏం అవ్వదు, కానీ ఒక మాస్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ లాంటి హీరోని విమర్శిస్తే ఆయన అభిమానులు ఇక ఊరికే ఉంటారా… నారాయణకు మెగా అభిమానులనుండే కాదు అన్ని వైపుల నుండి విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గారు.

క్షమాపణలు చెప్పిన నారాయణ…
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు, అలాగే మెగాస్టార్ చిరు అతిధులుగా హాజరైన విషయం తెలిసిందే. ఇక ఆ వేడుక గురించి మాట్లాడుతూ నారాయణ విమర్శలు గుప్పించారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా చిరును పిలవడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవి స్టేజీపై స్థానం తగదంటూ, చిల్లర బేరగాడు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఇక ఈ వాఖ్యలతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చిరంజీవి గురించి చేసిన కామెంట్ భాషాదోషంగా గమనించాను. దీనివల్ల చిరంజీవి అభిమానులతో పాటు కొందరికి బాధ, ఆవేశం కలిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీలు ఉండవు. దాని ప్రకారం నేను మాట్లాడింది వాస్తవమే. అయితే రాజకీయ భాషకు మించి చిరంజీవి గురించి మాట్లాడినదాన్ని భాషాదోషంగా పరిగణించాలి. మీకు దండం పెడుతున్నా, దాన్ని వదిలిపెట్టండి’ అంటూ క్షమాపణలు చెప్పారు.





























