తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే కీలక పరిణామంగా, నకిరేకల్ నుంచి ఏర్పేడు వరకు నిర్మించిన జాతీయ రహదారి-565 పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గణనీయమైన సౌలభ్యం కలగనుంది. ఇప్పటి వరకు పొడవైన మార్గాలు, అటవీ ప్రాంతాలు దాటాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ హైవే వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ రహదారి తెలంగాణలోని నకిరేకల్ నుంచి ప్రారంభమై నల్గొండ, దేవరకొండ ప్రాంతాలను దాటి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పల్నాడు జిల్లాలోని మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, రాపూరు, వెంకటగిరి మీదుగా సాగి చివరికి ఏర్పేడు వద్ద ముగుస్తుంది. ఏర్పేడు వద్ద నుంచి ఒకవైపు శ్రీకాళహస్తి, మరోవైపు తిరుపతి వైపు ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించారు.
సుమారు 420 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)ను, మదనపల్లె-నాయుడుపేట జాతీయ రహదారి (NH-71)తో అనుసంధానించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. దీంతో తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకోవడం మరింత సులభమవుతుంది.
ఇప్పటివరకు యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే అటవీ ప్రాంతాల్లోని గిరి మార్గాలు దాటాల్సి వచ్చేది. ముఖ్యంగా పుల్లలచెరువు, వెల్దుర్తి మధ్య ఉన్న ఘాట్ రోడ్డు చాలా క్లిష్టంగా ఉండేది. కొద్దిపాటి దూరాన్ని దాటేందుకు కూడా ఎక్కువ సమయం పట్టేది. అయితే కొత్త హైవే నిర్మాణంతో ఈ సమస్యలకు ముగింపు పలికింది. ఇప్పుడు అదే దూరాన్ని తక్కువ సమయంలో సులభంగా చేరుకోవచ్చు.
ఈ మార్గం అభివృద్ధికి దాదాపు రూ.393 కోట్లు ఖర్చు చేశారు. పర్వత ప్రాంతాల మీదుగా నిర్మాణం చేయాల్సి రావడంతో 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లు నిర్మించారు. అటవీ అనుమతులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, పనులను వేగంగా పూర్తి చేసి గడువుకంటే ముందే రహదారిని సిద్ధం చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కొండలు, లోయల మధ్యుగా సాగే ఈ కొత్త రహదారి ప్రయాణికులకు కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాదు, ఒక అందమైన ప్రయాణ అనుభూతిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రజలు, అలాగే కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంత ప్రజలకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.




























