భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఎంతో ఇష్టమైన పాట ఏంటో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో రెహమాన్ తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన సంభాషణలో ఆయన ధోనీ గురించి కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు.
సాధారణంగా తాను ధోనీని ఎయిర్‌పోర్ట్‌లలో లేదా ఇతర సందర్భాల్లో కలిసినప్పుడు చిన్నపాటి పలకరింపులకే పరిమితం అవుతుందని రెహమాన్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం కొద్దిసేపు మాట్లాడుకునే అవకాశం దొరికిందని తెలిపారు. ఆ సంభాషణలో ధోనీ తనకు ఇష్టమైన పాట గురించి చెప్పడం ప్రత్యేకంగా అనిపించిందన్నారు.
తన స్వరపరిచిన మున్బే వా పాట అంటే ధోనీకి ఎంతో ఇష్టమని, అది తన ఫేవరెట్ సాంగ్‌లలో ఒకటని ధోనీ చెప్పినట్టు రెహమాన్ వివరించారు. 2006లో విడుదలైన సిల్లును ఒకరు కాదల్ చిత్రంలోని ఈ పాట అప్పటినుంచే సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ వస్తోంది.
ఈ సందర్భంగా సీఎస్కే నిర్వహించిన కార్యక్రమం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని రెహమాన్ పేర్కొన్నారు. ఇంత పెద్ద స్టేడియంలో సంగీత ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పారు. అభిమానుల స్పందన తనను ఎంతో ఉత్సాహపరిచిందన్నారు.
ఇక సీఎస్కే జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయానని కూడా ఆయన వెల్లడించారు. విదేశాల్లో కూడా ఈ జట్టుపై ప్రజలకు ఉన్న గుర్తింపు తనను ఆకట్టుకుందని అన్నారు. క్రికెట్, సంగీతం రెండూ భాషా, ప్రాంతీయ సరిహద్దులను దాటి మనుషులను కలిపే శక్తి కలిగివున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.



























