ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) స్పష్టత ఇచ్చింది. ఆమె ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అదనపు చార్జిషీట్ దాఖలు
సిట్ బృందం తాజాగా రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో అదనపు చార్జిషీట్ సమర్పించింది. ఇందులో లక్ష్మీ దుర్గను రెండో నిందితురాలిగా (ఏ-2) పేర్కొంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలను కూడా చార్జిషీట్‌లో నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసు 2022 మే 19న వెలుగులోకి వచ్చింది. హత్య అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం, తర్వాత వెలుగులోకి వచ్చిన వివిధ వివరాలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
సాంకేతిక ఆధారాల సేకరణ
విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను సిట్ అధికారులు విశ్లేషించినట్లు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగానే లక్ష్మీ దుర్గ ప్రమేయంపై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గత ఏడాది బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జూలైలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విచారణ వేగం పెరిగింది. ఇప్పటికే అనంత బాబు గన్‌మెన్లు, అనుచరులను సిట్ అధికారులు ప్రశ్నించారు.
బెయిల్‌పై అనంత బాబు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎమ్మెల్సీ అనంత బాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయనపై విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు లక్ష్మీ దుర్గకు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. సిట్ అధికారుల ప్రకారం ప్రస్తుతం లక్ష్మీ దుర్గ పరారీలో ఉన్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కేసులో తదుపరి దశ
అదనపు చార్జిషీట్ దాఖలుతో కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. కోర్టు విచారణలో ఈ ఆధారాలు ఎంత మేర ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బాధిత కుటుంబం మాత్రం పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది. ఈ కేసు ప్రారంభం నుంచే రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజా పరిణామాలతో కేసు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక కోర్టు తీర్పు ఏ దిశగా వెళ్తుందో చూడాలి.































