చర్లపల్లిలో తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రాణాలు తీసుకున్న ఘటన ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకకుండా మిగిలిపోయింది. మొదట ఇది సాధారణ ఆత్మహత్య కేసుగా కనిపించినా, దర్యాప్తు లోతుకు వెళ్తే కేసు మరింత క్లిష్టంగా మారుతోంది. కుటుంబ కలహాలు లేవని, ఆర్థిక ఇబ్బందులు లేవని, ఉద్యోగ ఒత్తిడి లేదని ప్రాథమికంగా తేలినా… అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు.

ఈ ఘటనలో కీలక ఆధారంగా భావించిన సూసైడ్ నోట్ కారులో లభించింది. “నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు” అని బాధితురాలు విజయారెడ్డి రాసి ఉండటం కేసులో ప్రధాన అంశంగా మారింది. అయితే అదే సమయంలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు ఎందుకు తీసుకెళ్లిందన్నది పెద్ద ప్రశ్నగా నిలిచింది. పిల్లలకు ముందుగా ఈ విషయం చెప్పిందా? లేక చివరి క్షణం వరకు నిజం తెలియనివ్వలేదా? అన్న సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణులతో పరిశీలించారు. అందులో సాధారణ చాట్స్, ఫోన్ కాల్స్, అధికారిక మెయిల్స్ తప్ప మరే అనుమానాస్పద సమాచారం బయటపడలేదు. బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత సంభాషణలు అన్నింటినీ జల్లెడ పట్టినా స్పష్టమైన క్లూ దొరకలేదని అధికారులు చెబుతున్నారు.
ఘటనకు ముందు రోజు విజయారెడ్డి కదలికలను పోలీసులు నిమిషానికోసారి రీ-కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంట్లో పూజ చేసి బయటకు వెళ్లిన ఆమె, ముందుగా కుమారుడు ఉన్న హాస్టల్‌కు వెళ్లి అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకువచ్చింది. ఆపై కూతురు చదువుతున్న హాస్టల్‌కు వెళ్లి అక్కడ కూడా ఇదే కారణం చెబుతూ తీసుకువచ్చింది. ముగ్గురూ కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కారును పార్క్ చేసి ఫోన్, ల్యాప్‌టాప్‌ను కారులోనే ఉంచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే ట్రాక్ వైపు నడిచినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
విజయారెడ్డికి స్థిరమైన ఉద్యోగం, నెలకు సుమారు లక్ష రూపాయల జీతం, అదనంగా అద్దె ఆదాయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భర్త విదేశాల్లో పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నాడు. అప్పులు, ఆర్థిక వివాదాలు, కుటుంబ తగాదాలు ఏవీ లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త, తల్లి, తమ్ముడు, సహోద్యోగులు, హాస్టల్ సిబ్బంది సహా పలువురిని పోలీసులు విచారించారు. అయినప్పటికీ స్పష్టమైన కారణం బయటపడలేదు.
దాదాపు 800కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించినప్పటికీ అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించలేదు. రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా విశ్లేషణ వంటి అంశాలు పూర్తయిన తర్వాతే తుది నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ముగ్గురు ప్రాణాలు ఒకేసారి కోల్పోవడం సమాజాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా పిల్లల మృతితో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఉన్నా అసలు కారణం బయటపడకపోవడం కేసును మరింత గంభీరంగా మారుస్తోంది.
ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో… దర్యాప్తు చివరికి ఏ నిర్ణయానికి వస్తుందో చూడాల్సి ఉంది.































