Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే వాళ్ళ అభిమానులు గురించి మాట్లాడారు.

మీ ఫ్యాన్స్ ఏ మూలకెళ్ళినా కొడతారు…
ప్రభాస్ శీను కెరీర్ లో మొదట్లో రాజమౌళి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నా మధ్యలో గ్యాప్ వచ్చింది, అవకాశాలు వస్తాయా, సినిమా ఇండస్ట్రీ లోనే కొనసాగాలా లేక వెళ్లిపోవాలా అనే మీమాంసలో ఉన్న సమయంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. షూటింగ్ సమయంలో అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఇమిటేట్ చేస్తానని అడిగాను హరీష్ శంకర్ ను. ఇక పవన్ కళ్యాణ్ గారిని అడిగి పెడదాం అని ఆయన్ను అడిగితే ఓకే చేయండి అన్నారు, అలా గబ్బర్ సింగ్ మొదటి సీన్ చేయగానే అందరూ చప్పట్లు కొట్టారు.

అపుడు చాలా పాజిటివ్ గా అనిపించింది, ఖచ్చితంగా ఇది నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని అనుకున్నాను. ఇక అందులో పవన్ గారు నన్ను కొట్టే సన్నివేశంలో జాగ్రత్తగా తగులుతుందేమో అన్నారు. నేను పర్వాలేదు తగిలినా ఏం ప్రాబ్లెమ్ లేదు, నేను మీ ముందు చాలా ఓవర్ యాక్షన్ చేసాను మీరు ఇప్పుడు నాలుగు ఎక్కువ తన్నినా ఏం కాదు ఒకవేళ మీరు కొట్టక పోతే మీ ఫ్యాన్స్ ఏదో ఒక మూల నన్ను ఉతికేస్తారు అంటూ అన్నాను, ఆయన నవ్వేసాడు అంటూ ప్రభాస్ శీను పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి చెప్పారు.

































