నేడు రాఖీ పండుగ.. ఈ రోజు సోదరులు ఏం చేయాలి.. వాటి విశిష్టత ఏమిటి!

ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. ప్రస్తుతం ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు. నేడు (ఆగస్టు 22)న దేశ వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు ఎంతో కనుల పండుగగా జరుపుకోనున్నారు. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర.. సోదరీమణులకు మధ్య ఉండే బంధం చాలా స్పెషల్. ఎన్ని గొడవలు, వాగ్వాదాలు పెట్టుకున్నప్పటికీ చివరికీ ఇద్దరూ ఒక్కటై పోతారు. చెల్లి ఆపదలో ఉందంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది అన్న మాత్రమే. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. అలాంటి ప్రత్యేక బంధం ఇది. వీరు ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుకోవడానికి వీలైన పండగ వేదిక రక్షాబంధన్. ఈ రాఖీ పౌర్ణమి ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.

తన సోదరుడు ఎన్నో శిఖరాలను అధిరోహించాలని.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతీ సోదరి కోరుకుంటుంది. అయితే ఇంతటి విశిష్టత ఉన్న రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే.. ఈ పండగ మొత్తం రెండు పదాలతో కూడుకున్నది. ఒకటి రక్షణ.. మరొకటి బంధనం. సంస్కృతం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పండుగని ముడితో రక్షణ ఇవ్వమని అర్థం. రక్షణ అంటే రక్షణ కలిగించడం బంధం అంటే కట్టుకోవడం. అలానే ఇది కేవలం సోదరి సోదరుడు మాత్రమే జరుపుకొనే పండుగ కాదు. మరదలు, చెల్లెలు, కజిన్స్ ఇలా ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీటికి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. సమాజంలో మానవతా విలువలు మంటకలిసిపోతున్న నేపథ్యంలో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

రాఖీ పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని.. రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు.. సోదరీమణులు. అన్న లేదా తమ్ముడు కూడా సోదరీమణులు కట్టిన రాఖీలను స్వీకరించి తమకు తోచిన సహాయాన్ని ఇస్తుంటారు. “యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు సోదరీమణులు. తరువాత స్వీట్స్ తినిపిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. ఈ సంవత్సరం రాఖీలకు గిరాఖీ బాగా పెరిగింది. బంగారం, వెండి రాఖీలు కూడా మార్కెట్లో సరికొత్త డిజైన్లతో సందడి చేస్తున్నాయి.

రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే మంచి జురుగుతుందని నమ్మకం. ఇలా చేసేవారికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావని చెబుతుంటారు. ఈ రోజు చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే దోషాలు పోతాయని కూడా చెబుతుంటారు. రక్షా బంధన్ నాడు సోదరీ సోదరులకు రాఖీ కట్టడం సోదరుడు తిరిగి ఏదైనా బహుమతి ఇవ్వడం తరతరాలుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆచారం ప్రకారం రక్షా బంధన్ జరుపుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడూ అక్కా తమ్ముడు, అన్నాచెల్లెళ్లు చక్కగా ఒకరికొకరు తోడుగా.. నీడగా.. నిలవాలని ‘తెలుగు డెస్క్’ కోరుకుంటోంది.