టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (వయసు 90) కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో రవితేజ ఇంటిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఉదయం నుంచే పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు రవితేజ నివాసానికి చేరుకుని రాజగోపాల్ రాజు భౌతికకాయాన్ని దర్శించి, చివరి వీడ్కోలు తెలిపారు.
రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రవితేజ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు భరత్ 2017లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో భరత్ మృతి సినీ పరిశ్రమను కలిచివేసింది. ఇప్పుడు ఆయన తండ్రి మృతి కూడా మరోసారి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.
రవితేజ కుటుంబానికి అభిమానులు, సినీ రంగ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఆయన కుటుంబానికి శాంతి చేకూరాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.































