టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు బుచ్చి బాబు సన ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కనిపించనుంది. చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం, దీంతో ‘రంగస్థలం’ తరహా ప్రభావం మరోసారి రిపీట్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
ఇక తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఓ వార్త సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్‌తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ‘యేవడు’ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు మరోసారి అదే జోడీ కనిపించనుందనే వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉందని సమాచారం. మరోవైపు, సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. మొదట ఈ పాట కోసం ఇతర పేర్లు వినిపించగా, ఇప్పుడు మానస వారణాసి పేరు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఆమె చరణ్‌తో కలిసి డాన్స్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ‘పెద్ది’ సినిమా కాస్టింగ్ నుంచి కథ వరకు ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.































