Road Accident : ఆడుతుపాడుతూ ఇంకా స్కూల్ చదువులు ఏంటో తెలియని చిన్నారి స్కూల్ బస్ కింద పడి మృతి చెందింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ళముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం అలానే తల్లి ఏమరపాటు ఆ బిడ్డను బలిగొన్నాయని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

అక్కకోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లిన నైనిక…
సూర్యాపేట మున్సిపాలిటీ రెండో వార్డు కోమటికుంట తండా గ్రామానికి చెందిన మేడారపు శేఖర్, నాగరాణి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మయి స్కూల్ లో చదువుతుండగా రెండో అమ్మాయి నైనిక ఇంకా స్కూల్ వెళ్లడం లేదు. ఇక వీరికి మూడో సంతానం గా ఒక మగపిల్లాడు ఉన్నాడు. ఎప్పటిలాగానే జనవరి 30 వ తేదీన స్కూల్ కి వెళ్లిన పెద్దమ్మాయిని తీసుకురడానికి బస్ దగ్గరకి నాగరాణి వెళ్లగా అమ్మతో పాటు నైనిక అక్కను తీసుకురాడానికి రోడ్డు మీదకు వెళ్ళింది. స్కూల్ బస్ నుండి పాపను దించుకున్న నాగరాణి పాపను తీసుకుని రోడ్డు దాటడానికి ముందుకు రాగా వెనుక ఉన్న చిన్న పాప నైనికను గమనించలేదు.

సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ బస్ ముందు ఎవరూ లేరనుకుని నిర్లక్ష్యంతో బస్ ముందుకు నడపడంతో పాప నైనిక ను బస్ ఢీ కొట్టి అక్కడే పాప పడిపోయింది. నాగరాణి పాప ఎక్కడుందని గమనించేలోపే పాపను బస్ కొట్టడంతో తలకు దెబ్బ తగిలి రోడ్డు మీద పడి ఉంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినా తలకు దెబ్బ తగలడంతో సీరియస్ అయింది, వెంటనే హైదరాబాద్ కి తరలించి వైద్యం చేయించినా పాప మరణించింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఓ తల్లి అజాగ్రత్తకు మూడేళ్ళ చిన్నారి బలైంది.