తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది రాజకీయ మార్పుల కంటే ఒక కార్యక్రమానికి సంబంధించిన చర్చగా భావిస్తున్నారు.
వచ్చే నెలలో తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించబోయే ‘వందేమాతరం’ గానం కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడేందుకు ఆమె బీజేపీ నాయకులను కలిసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు, సహకారం వంటి అంశాలపై చర్చించినట్టు చెబుతున్నారు.
ఇటీవలే మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడం మరింత ఆసక్తిని పెంచింది.
అంతేకాదు, రెండు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కూడా ప్రీతిరెడ్డి సమావేశం కావడం గమనార్హం. వరుస భేటీలతో మల్లారెడ్డి కుటుంబం రాజకీయంగా ఎటు దిశగా అడుగులు వేస్తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైతే ఈ భేటీలు కార్యక్రమ నిర్వహణకు మాత్రమే సంబంధించినవని చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాలు మాత్రం దీని వెనుక మరేదైనా సంకేతం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నాయి.



































