Senior Journalist Imandhi Ramarao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో మొదట్లో విలన్ గాను ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో చేసిన చలపతిరావు గారు డిసెంబర్ 25న ఆదివారం నాడు రాత్రి భోజనం అయ్యాక మరణించారు. 700 పైగా సినిమాల్లో నటించిన ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా అందరికీ తెలుసు. ఆయన తనయుడు రవి బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. విభిన్నమైన సినిమాలను తీస్తూ పేరు తెచ్చుకున్నాడు. అల్లరి, అవును, నచ్చావులే అంటూ సినిమాలను తీసి మంచి హిట్లను కూడా అందుకున్నాడు. ఇక చలపతి రావు గారి కుటుంబం వ్యవసాయిక కుటుంబం. నాటకాలు, సినిమాల మీద మక్కువతో చలపతి రావు గారు సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ గారంటే ఎంతో అభిమానం ఉన్న ఆయన ఎన్టీఆర్ కు చాలా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఒకరు.

చంద్రబాబు పెళ్ళిలో చలపతిరావు అలా చేశారు…
ఎన్టీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉండే చలపతిరావు గారు వాళ్ళింట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగారు. ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన ఆయన ఎన్టీఆర్ గారి ప్రొద్భలంతో ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో ఐదు పాత్రలలో నటించారు. ఇక ఆయన గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు చెబుతూ ఒక సరదా సంఘటన వివరించారు.

చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్ళిలో వెడ్డింగ్ కార్డు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని అనడంతో చలపతి గారు ఏకంగా పెళ్ళికి వచ్చిన తమిళ హీరో శివాజీ గణేశన్ గారినే ఆపేసాడట. వెడ్డింగ్ కార్డు తీసుకురావడం మర్చిపోయాము అయినా నన్నే ఆపేస్తారా అని గొడవ పడినా వినలేదట. ఇక చివరికి ఎన్టీఆర్ గారు ఆయన తమ్ముడు వచ్చి చలపతి రావు గారిని మందలించి శివాజీ గణేశన్ గారికి క్షమాపణలు చెప్పారట.



























