Singer Nihal : తేజ డైరెక్షన్ లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘చిత్రం’. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరో కాగా రీమా సేన్ హీరోయిన్. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ కావడమే కాకుండా మ్యూజికల్ గా కూడా మంచి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలోని అన్ని పాటలూ మంచి హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ఉహల పల్లకీలో ఊరేగించనా పాట మంచి హిట్. ఆ పాటను సింగర్స్ నిహాల్, ఉష పాడారు. ఆ పాటతో ఒక్కసారిగా నిహాల్ పేరు బాగా వినిపించింది. కానీ ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోలేకపోయానని నిహాల్ చెబుతారు. రిసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అవకాశాలు పోవడానికి కారణం అదే…
చిత్రం సినిమాలో ఉహల పల్లకీలో, అలాగే ఆ అమెరికా అమ్మాయి, నాకు కుక్క కావాలి వంటి సాంగ్స్ ను నిహాల్ పాడారు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చినా తాను ఇండియా మారిషస్ కల్చరల్ ఇంట్రాక్షన్ కార్యక్రమంలో భాగంగా నాలుగేళ్లు మారిషస్ కి వెళ్లడం వల్ల సినిమా ఆఫర్స్ కోల్పోయానంటూ చెప్పారు.

ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్న సమయంలో ముంబైలో ఆశా భోంస్లె నా గొంతు విని తన మ్యూజికల్ కన్సర్ట్స్ లో పాడటానికి అవకాశం ఇస్తానని చెప్పినా అప్పటికే మారిషస్ వెళ్ళడానికి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల అంత మంచి ఆఫర్ కూడా వదులుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మారిషస్ కు ఇండియన్ అంబాసిడర్ గా అవకాశం వస్తే వెళ్లానని, వెళ్తున్నానని చెబితే బాలు గారు అందరూ తిట్టారంటూ చెప్పారు నిహాల్.































