బ్రేకింగ్ న్యూస్: గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు..

ప్రసిద్ధ టాలీవుడ్ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, 66 సంవత్సరాల వయస్సులో, న్యుమోనియాతో నవంబర్ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతడి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను వెల్లడిస్తున్న వైద్యులు కాసేపటి కిందటే.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.

తాజాగా అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి మరణం సినీ రంగ ప్రముఖులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కోరారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి 1984లో జననీ జన్మభూమితో గేయ రచయితగా అరంగేట్రం చేశారు. అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల (1986)లో “విధాత తలపున” పాటతో అతను కీర్తిని పొందాడు.

శాస్త్రి ఇప్పటి వరకు 3000 పాటలు రాశాడు. స్వయంకృషి, స్వర్ణ కమలం, శ్రుతిలయలు, గాయం, స్వాతి కిరణం, క్షణ క్షణం, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం, గమ్యం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళల రంగంలో ఆయన చేసిన కృషికి 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

అంతే కాదు.. 11 రాష్ట్ర నంది అవార్డులు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లను గెలుచుకున్నాడు. గేయ రచయితగా వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను అతడు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతను కొండపొలం, నారప్ప వంటి సినిమాలకు కూడా పాటలు రాశాడు.