సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఒక్క తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్, రేంజ్..అసాధారణం. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళ ఇండస్ట్రీలో అభిమానులు చేసే హంగామా, హడావుడి మాటల్లో చెప్పలేరు. ఆ రోజు ఆఫీసులు బంద్, కాలేజీలు, స్కూళ్ళు బంద్..కొన్ని కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కు టికెట్స్ ఇచ్చి మరీ సినిమాకు పంపుతారు. అది తమిళనాడులో తలైవర్ సత్తా. రజనీ స్టైల్ మరో హీరోకి రాదు. ఆయన చెప్పే డైలాగ్ మాడ్యులేషన్ ఇంకొకరు ఇమిటేట్ చేయలేదు.

అందుకే సూపర్ స్టార్ రేంజ్‌ను ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేకపోయారు. బాబా సినిమా సమయంలో ఇదే నా చివరి సినిమా అంటే ఇండస్ట్రీలతో పాటు..దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగా బాధపడ్డారో చెప్పలేము. కానీ బాబా సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓ భారీ హిట్ కొట్టి సినిమాలు మానేద్దామనుకున్నారు. కానీ ఆయన మనసు మార్చుకొని మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. శివాజీ సినిమా లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ రోబో మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన రోబో 2.ఓ తీవ్రంగా నిరాశపరచింది.

అంతేకాదు యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ చేసిన కబాలి, కాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన పేట, దర్బార్ సినిమాలు కూడా రజనీకాంత్‌కు కనీసం యావరేజ్ హిట్ కూడా ఇవ్వలేకపోయాయి. ఇలా రజనీ చేసిన సినిమాలు వరుసగా బక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలుగా నమోదవుతుండటంతో..అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు. దాంతో ఈసారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టి తన సత్తా చాటాలనుకున్నారు తలైవర్.

అందుకే తెలుగువాడైన దర్శకుడు శివ గత కొంతకాలంగా తమిళ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ వస్తున్నాడు. అజిత్ కుమార్‌కు బ్యాక్ టు బ్యాక్ మాస్ ఎంటర్‌టైనర్స్‌తో భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. అదే రజనీకాంత్ అవకాశం ఇచ్చేలా చేసింది. శివకు ఉన్న క్రేజ్.. అతని మేకింగ్ స్టైల్ నచ్చి రజనీకాంత్ అణ్ణాత్త సినిమా అవకాశం ఇచ్చారు. శివ, రజనీ కాంబినేషన్ అనగానే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను దర్శకుడు ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చాడు.

అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. శివ తీసుకున్న కథ పరమ రొటీన్ కావడంతో ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పుకుంటున్నారు. అన్నా – చెల్లి మధ్య ఎమోషనల్ డ్రామా అనే కథాంశాలు ఇప్పటికే కోకొల్లలు వచ్చాయి. వాటిలో హిట్ సినిమాలున్నాయి..ఫ్లాప్ సినిమాలూ ఉన్నాయి. ఇలాంటి అరిగిపోయిన పాయింట్‌ను రజనీ మీద ప్రయోగించడం వల్లే అణ్ణాత్త సినిమాకు నెగిటివ్ రివ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. అభిమానులు పెట్టుకున్న అంచనాలు తాజాగా వచ్చిన అణ్ణాత్త ( పెద్దన్న ) కూడా తారుమారు చేసింది.































