Telangana CM KCR : తెలంగాణ అవశేష ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావం ఊరికే అయిపోలేదు… తెలంగాణ పౌరుల పోరాటం, బలి దానాలు, త్యాగాలు సకల జనుల సమ్మెలు ఇలా ఎన్నో ప్రతిఘటనలు. అయితే అలా జనాలను ముందుకు నడిపిన నాయకుడు మాత్రం ఒక్కడే అతనే కెసిఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం పార్టీ పెట్టి పోరాడి, కొట్లాడి చివరికి తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అంటూ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన యోధుడు. అయన కేవలం పోరాటాల్తో ఆగిపోలేదు తెలంగాణ వచ్చిన తరువాత తన రాజకీయ వ్యూహలతో పార్టీని పటిష్టం చేసుకుంటూ తెలంగాణ అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే తెలంగాణ అనే ఒరవడిని అక్కడి ప్రజల్లో తీసుకోచ్చారు. ఆయన పాలనలో.. కోటి ఎకరాల మాగాణి లక్ష్యం అంటూ దేశంలోనే తొలిసారి రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతు బంధు పెట్టినా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా అది కెసిఆర్ మార్కు పాలన. అయితే ఆయన ఈ స్థాయికి ఊరికే రాలేదు ఆయన రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకులు ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పాయి.

తొలి రాజకీయ జీవితం… మంత్రి పదవి రాకపోవడం తో బయటికి…
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు 1957 ఫిబ్రవరి 17న జన్మించారు. అయితే ఆయన పూర్వీకులది విజయనగరం జిల్లా అని అక్కడి నుండి తెలంగాణకు వలస వెళ్ళారనే వాదన ఉంది. ఇక కెసిఆర్ గారికి తొమ్మిది మంది సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నాడు. చింత మడక గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కెసిఆర్ గారు ఆ తరువాత కాలేజీ చదువు మెదక్ జిల్లా దుబ్బాక గ్రామంలో పూర్తి చేశారు. ఇక డిగ్రీ సిద్ధిపేట్ కాలేజీ లో పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. కాలేజ్ లో చదివే రోజుల్లోనే తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల మీద పట్టుసాధించారు కెసిఆర్. అది ఆయనకు రాజకీయ ఎదుగుదలకు బాగా తొడ్పడింది.

ఇక కెసిఆర్ తన 17వ ఎటనే పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయన చిన్నవయసు నుండే రాజకీయాల్లోకి రావాలని అలోచించి కాలేజ్ లో చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘం అధ్యక్ష పోటిల్లో పాల్గొని ఓడిపోయారు. ఇక చదువయ్యాక మెదక్ జిల్లా కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకున్నారు. అయితే 1982లో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టడాని తెలుగుదేశం లోకి చేరారు చంద్ర శేఖర్ గారు. ఇక 1983 లో మొదటి సారి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ఓడిపోయారు. 1985 లో మరోసారి పోటీ చేసి గెలిచారు ఇది ఎమ్మెల్యే గా కెసిఆర్ గారికి తొలిగెలుపు. ఇక అక్కడి నుండి ఆటు ఎమ్మెల్యే, మంత్రి గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి స్పీకర్ గా కూడా పనిచేసిన ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కక పోవడం తో పార్టీకి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించారు.

మొదట్లో పదవులను ఆశించి పార్టీ పెట్టాడు అనే అపవాదు ఉన్నా ఆ తరువాత ఆయన తెరాస పార్టీ ని కాంగ్రెస్ తో పొత్తు ద్వారా ఎంపీ గా గెలిచి కేంద్రంలో కార్మిక మంత్రిగా పనిచేసారు. ఇక 2006 ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం మళ్ళీ మొదలుపెట్టారు. వాక్చాతుర్యంతో తెలంగాణ జనాలను జాగృతం చేసి సెంట్రల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన సమయంలో సమైఖ్య ఆంధ్ర ఉద్యమం ఇటు ఆంధ్ర లో ఊపందుకోడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.

ఇక రాజశేఖర్ రెడ్డి మరణం, కేంద్ర కాంగ్రెస్ లో ఆన్స్చితిని ఆసరాగా తీసుకుని కెసిఆర్ పోరాటం ఉదృతం చేసారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అంటూ నిరాహార దీక్ష చేయడం, తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చిలు చేయడం, ఉస్మానియా విద్యార్థుల బలి దానాలు ఇవన్నీ కేంద్రాన్ని ఉక్కిరిబిక్కి చేసాయి. చివరికి 2013 లో కేంద్రం 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇలా ఒక నాయకుడు తన మాటలతో ఎంతోమంది జనాలను జాగృతం చేసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయిన ప్రత్యేక రాష్ట్రంను అందించారు.





























