ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే రెండు రోజుల పాటు పలుచోట్ల తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

శనివారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిధి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో కలిపి సుమారు 73 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరికొన్ని మండలాల్లో సాధారణ వడగాలులు ఉండే అవకాశం ఉంది.
ఆదివారం కూడా పరిస్థితి పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. మరోసారి పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ, వడగాలుల ప్రభావం కొనసాగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. సుమారు 30కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని, చిత్తూరు జిల్లా రాయలపేట, అనకాపల్లి జిల్లా నాతవరం వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వడగాలుల దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తల కప్పుకుని, నీడలోనే ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు.
శరీరంలో నీటి లోపం రాకుండా ఉండేందుకు తరచూ నీరు తాగడం చాలా అవసరం. అలాగే ఓఆర్‌ఎస్ ద్రావణం, మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండల ప్రభావాన్ని తక్కువ చేసుకునేందుకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.




























