దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లతో చేయాల్సిన సినిమాలు ఎలా ఆగిపోయాయో వివరించారు.

బాలకృష్ణతో ఒక సినిమా ప్రారంభ దశలోనే నిలిచిపోయిందని సముద్ర తెలిపారు. కథ ఎంపికలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, చివరికి ఒక కథను ఫైనల్ చేసి ముహూర్తం కూడా నిర్వహించారని చెప్పారు. అయితే ముహూర్తం రోజే కొబ్బరికాయ కుళ్లిపోయిన ఘటన జరగడంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగదనే భావన కలిగిందని పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు. తర్వాత మరోసారి కలిసి సినిమా చేయాలని బాలకృష్ణ ఆసక్తి చూపినా, డేట్స్ సమస్యల వల్ల అది కూడా జరగలేదని చెప్పారు.
పవన్ కళ్యాణ్‌తో చేయాల్సిన ‘అన్నవరం’ సినిమా కూడా తన చేతిలోకి వచ్చి మిస్ అయిందని సముద్ర వివరించారు. ఆ సమయంలో తాను ‘మహానంది’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయానని చెప్పారు. ఇప్పటికే మరో దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చిన కారణంగా ఆ అవకాశం కూడా చేజారిందని పేర్కొన్నారు.
ఇలా తన కెరీర్‌లో పలుమార్లు మంచి అవకాశాలు దగ్గరికి వచ్చి చివరి నిమిషంలో జారిపోయాయని సముద్ర తెలిపారు. అయినప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు మంచి కాంబినేషన్ తప్పకుండా కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.































