
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు, సామాన్యులపై నేరుగా భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సోమవారం డాలర్ మారకం విలువ వద్ద 90.78 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం మరింత బలహీనపడి 90.83 స్థాయికి చేరింది. ఇదే రూపాయి చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయిగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని రోజులుగా రూపాయి పతనం ఆగకుండా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇంకా పడిపోతుందా?
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే రంగాలపై పడనుంది.
జనవరి నుంచి ఏ ధరలు పెరగనున్నాయంటే…
రూపాయి బలహీనత కారణంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- స్మార్ట్‌ఫోన్లు, టీవీలు:
మొబైల్ ఫోన్లు, టీవీల తయారీలో ఉపయోగించే చిప్స్, ఎలక్ట్రానిక్ బోర్డులు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. దీంతో తయారీ ఖర్చు పెరిగి, జనవరి నుంచి టీవీల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. - ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు:
ఖర్చులు పెరగడంతో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో మొబైల్ వినియోగం సామాన్యులకు మరింత భారంగా మారనుంది. - ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు:
ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. - విదేశీ కార్లు:
దిగుమతి అయ్యే కార్లపై ఖర్చు పెరగడంతో వాటి ధరలు కూడా ఎగబాకే సూచనలు ఉన్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇటీవల కేంద్ర ప్రభుత్వం 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత తగ్గాయి. అయితే రూపాయి పతనం కారణంగా ఆ ప్రయోజనం కొంతమేర తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.
రూపాయి పతనానికి కారణాలేమిటి?
రూపాయి బలహీనత వెనుక పలు అంతర్జాతీయ, దేశీయ అంశాలు పనిచేస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- అమెరికా విధించిన టారిఫ్ విధానాలు కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు
- ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన విదేశీయులు వాటిని వెనక్కి తీసుకుని తమ దేశాలకు తరలిస్తున్నారు
- భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతోంది
- భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా స్పష్టత లేకపోవడం కూడా ప్రభావం చూపుతోంది
ఈ వాణిజ్య ఒప్పందం వచ్చే ఏడాది మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటివరకు అనిశ్చితి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
సామాన్యుడిపై ప్రభావం తప్పదా?
రూపాయి విలువ పతనం నేరుగా సామాన్య ప్రజల జీవనంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, మొబైల్ సేవల ధరలు పెరగడం వల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. పరిస్థితులు ఎటువైపు మళ్లుతాయన్నది రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.































