టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన నాన్నమ్మ ఆగ్నేస్ లక్ష్మీ (వయసు 88) కన్నుమూశారు. ఈ వార్తను సందీప్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొని నాన్నమ్మకు కన్నీటి నివాళులు అర్పించారు.

తన నాన్నమ్మ మృతిపై సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో స్పందించారు. ‘‘నిన్న మా చివరి గ్రాండ్‌పేరెంట్ అయిన మా నాన్నమ్మను కోల్పోయాం. మా తాత కృష్ణం నాయుడు ఒక షిప్ ఆర్కిటెక్ట్, మా నాన్నమ్మ ఆగ్నేస్ లక్ష్మీ విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. వీరిద్దరిది 1960లలో జరిగిన ఇంటర్ రిలీజియన్ ప్రేమకథ… ఒక్కసారిగా చూసినట్టు సినిమా కథలా అనిపిస్తుంది. పెళ్లి తరువాత తాతగారు ‘జోసెఫ్ కృష్ణ నాయుడు’గా, నాన్నమ్మ ‘ఆగ్నెస్ లక్ష్మి’గా మారారు. వీరి ప్రేమకథ నాకు తెలిసిన అత్యుత్తమమైన ప్రేమకథలలో ఒకటి’’ అంటూ ఎమోషనల్‌గా రాశారు.
ఇంటర్ రిలీజియన్ ప్రేమను అంగీకరించి, ప్రేమను అడ్డుపెట్టుకొని జీవితాన్ని నిర్మించుకున్న తమ తాతమ్మల జంట తనకు ఎంత గర్వంగా ఉందో కూడా సందీప్ వెల్లడించారు. అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ఈ ఘటనపై సంతాపం తెలియజేస్తున్నారు.





























