విలక్షణ కథలు, కొత్త తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడవి శేష్ తాజాగా తన రాబోయే చిత్రం ‘డెకాయిట్’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆయన, ద్విభాషా చిత్రాల చిత్రీకరణలో ఎదురైన అనుభవాలను వివరించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రతి సన్నివేశాన్ని రెండుసార్లు చిత్రీకరించాల్సి వచ్చిందని చెప్పడం విశేషం.

ఈ చిత్రానికి తాను, దర్శకుడు షానీల్ డియో కలిసి కథను రూపొందించామని శేష్ తెలిపారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఏదైనా సన్నివేశం సరిగా అనిపించకపోతే వెంటనే చెప్పుకునే స్వేచ్ఛ ఉండేదని, అదే సినిమాకు బలం అయ్యిందని పేర్కొన్నారు. దర్శకుడు హిందీ నేపథ్యానికి చెందినవాడు కావడం, తాను తెలుగు ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకోవడం వల్ల రెండు భాషల్లోనూ సహజత్వం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.
‘డెకాయిట్’ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న నేపథ్యంలో, ప్రతి సీన్‌ను విడివిడిగా రెండు సార్లు షూట్ చేసినట్లు శేష్ వివరించారు. ముందుగా దర్శకుడు హిందీలో సీన్‌ను తెరకెక్కించి, ఆ తర్వాత తెలుగు వెర్షన్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి మళ్లీ అదే సన్నివేశాన్ని చిత్రీకరించేవారమని తెలిపారు. ఇలా చేయడం వల్ల రెండు భాషల ప్రేక్షకులకు సహజంగా అనిపించేలా కథను అందించగలిగామని చెప్పారు.
అంతేకాకుండా, కొన్నిసార్లు ఒకే సన్నివేశాన్ని రెండు భాషల్లో వేర్వేరు రీతిలో తీర్చిదిద్దాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా డైలాగ్‌లు, పంచ్‌లు ముందుగా ఉంచితే, హిందీ వెర్షన్‌లో వాటి స్థానాలను మార్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ విధంగా ప్రతి అంశాన్ని ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్చడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు.
ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా కోసం చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకం చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



























