ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల జాబితాలో బీట్రూట్ ముందువరుసలో ఉంటుంది. రక్తాన్ని పెంచే గుణం, శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల చాలామంది దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్‌ను ‘సూపర్ ఫుడ్’గా భావించి క్రమం తప్పకుండా తీసుకునేవారు కూడా ఉన్నారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇది సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీట్రూట్లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రక్తహీనత తగ్గించడంలో, చర్మానికి కాంతి ఇవ్వడంలో, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఇది ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆక్సలేట్స్ శరీరంలోని కాల్షియంతో కలిసి రాళ్ల ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.
అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించే లక్షణం కలిగి ఉంటాయి. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిదే కానీ, లో బిపి ఉన్నవారిలో మాత్రం బలహీనత, తల తిరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి కూడా బీట్రూట్ జ్యూస్ అంతగా అనుకూలం కాకపోవచ్చు. కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అదనంగా, కొందరిలో బీట్రూట్ తీసుకున్న తర్వాత మూత్రం లేదా మలం ఎర్రటి రంగులోకి మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇది సాధారణంగా ప్రమాదకరం కాకపోయినా, శరీరానికి తగినట్లుగా లేదనే సంకేతంగా భావించాలి.



























