కర్నూలు జిల్లాలో ఓ చిన్నారి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చదువుకోవాలన్న తపన ఉన్నా, పరిస్థితుల కారణంగా తన భవిష్యత్తు ఆగిపోతుందేమో అన్న ఆందోళనతో ఆ పాప చేసిన అభ్యర్థన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

గోనెగండ్ల మండలం నేరేడుప్పుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వీరేష్, భాగ్యమ్మల కుమార్తె మానస ప్రస్తుతం ఐదో తరగతి పూర్తి చేసి ఆరో తరగతిలో ప్రవేశానికి సిద్ధమవుతోంది. స్థానికంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు వస్తే తన చదువు కొనసాగుతుందని ఆశపడ్డ ఆమె, దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే సీటు రాకపోవడంతో కుటుంబం ఆందోళనలో పడింది.
గ్రామంలో సరైన ఉపాధి లేక తల్లిదండ్రులు వలస పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారితో పాటు వెళ్తే చదువు ఆగిపోతుందన్న భయంతో, ఇక్కడే ఉంటే చూసుకునే వారు లేక మానస భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి ఆ చిన్నారి మనసును తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఈ నేపథ్యంలో మానస రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి భావోద్వేగంగా విజ్ఞప్తి చేసింది. “లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించండి.. నేను బాగా చదువుకుంటా” అంటూ చేతులు జోడించి చేసిన అభ్యర్థన వీడియో రూపంలో బయటకు రావడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రభుత్వం విద్యా అభివృద్ధి, పాఠశాల ప్రవేశాలు, హాస్టల్ సదుపాయాలపై పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, మరోవైపు ఓ పేద కుటుంబంలోని చిన్నారి కేవలం హాస్టల్ సీటు లేక చదువు ఆగిపోతుందన్న పరిస్థితి ఎదుర్కొనడం ఆవేదన కలిగిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిన్నారికి వెంటనే సహాయం చేయాలని కొందరు కోరుతుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి విద్యాశాఖ ఈ అంశంపై స్పందిస్తుందా అన్నదానిపైనే ఉంది. మానసకు హాస్టల్ సీటు లభించి ఆమె చదువు కొనసాగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.





























