ఒకరిని దీవిస్తున్నపుడు, శుభ కార్యాల్లో, పూజల్లో భాగంగా అక్షింతలు వాడటం ఒక సంప్రదాయంగా పాటిస్తాం. అవే ఎందుకు అని చాలా మందికి సందేహం ఉంటుంది. వాటికి బదులు రకరకాల పూలు వేయొచ్చు కదా అన్న సందేహం వస్తుంది. పూల కన్నా, అక్షింతలు వాడటం వెనుక అంతరార్థం పెద్దదే అంటున్నాయి పురాణాలు. అక్షింతలు అంటే క్షతము (నాశనం) కానివి అని అర్థం. బియ్యం శుభానికి, సమృద్దికి సంకేతం. పసుపు క్రిమి సంహకరాలను నివారిస్తుంది. ఈ రెండిటినీ కలపడం వల్ల ఆరోగ్యకరమైన అభివృద్ధి సొంతమవుతుంది. అందుకే దీవించేందుకు వీటిని ఉపయోగిస్తారు.

అయితే వాటిని ఎలా పడితే అలా వేయకుండా పెద్దవాళ్ళు, చిన్నవాల్ల తలలోని బ్రహ్మరంధ్రం పైన పడేలా అక్షింతలు వేస్తూ దివించాలి. దాని వల్ల అక్షతమైన ఆయురారోగ్యాలు, ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి సిద్ధిస్తాయని చెబుతారు. అక్షింతల్ని అలా తలలోని బ్రహ్మరంధ్రం పైన చల్లడం వల్ల శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజిత అవుతాయి. ఇక పూజలో భాగంగా కొన్నిసార్లు గంధం కానీ, కుంకుమ కానీ సరిపడా పువ్వులో అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటన్నిటికీ బదులుగా అక్షింతలు వాడటం సరైన పరిష్కారం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంటే అక్షింతలు పూజా సామాగ్రిలోని లోటును పూడ్చందుకు ఉపయోగ పడతాయి అందుకే అలా వాడిన అక్షింతలనే పూజ అంతా అయ్యాక తలపై చల్లుతారు. కేవలం వాడటమే కాదు, వీటిని తయారు చేసుకునే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణంగా ఉండే బియ్యపు గింజల్నే అక్షింతలు తయారీకి ఎంచుకోవాలి. బియ్యం కూడా తెల్లగా, శుభ్రంగా ఉండాలి. వాటిలో ఆవు నెయ్యి, పసుపు కలిపినప్పుడు అవి సరైన అక్షింతలు అవుతాయి. దేవీ పూజలో కొన్ని సార్లు పసుపుకు బదులుగా కుంకుమను వాడుతుంటారు కాబట్టి సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు.

































