Writer & Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయిత గా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సంతోషం సినిమా చేయనన్నాను…
నాగార్జున, శ్రీయ, గ్రేసీ సింగ్ నటించిన ‘సంతోషం’ సినిమా నాగార్జున గారి కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఆ సినిమా దశరథ్ గారి కెరీర్ కి మంచి హెల్ప్ అయింది. అలాంటి సినిమాను మొదట దశరథ్ గారు చేయకూడదని అనుకున్నారట. అయితే నువ్వునేను సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో గోపాల్ రెడ్డి గారికి నటుడు బెనర్జీ ద్వారా కథ చెప్పడానికి వెళ్లి ఓకే చేయించుకున్నారట దశరథ్. అదే సమయములో వాళ్ళు నాగార్జున తో ఒక సినిమా చేయాల్సి ఉండగా కథ ఫైనల్ కాక ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ సమయంలో దశరథ్ మరో కథ రెడీ చేసి అది నాగార్జున కు వినిపించడం ఆ కథ ఓకే అయిపోవడం జరిగిపోయాయి.

ఆ సినిమానే సంతోషం, ఆ సినిమా డైరెక్షన్ మొదట దశరథ్ చేయాలని అనుకోలేదు. కేవలం కథ అందించి వదిలేసారు. అయితే గోపాల్ రెడ్డి గారు మీరే డైరెక్షన్ చేయండి అని చెబితే నేను చేయను నాకు సమయం కావాలి చేయాలంటే ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా చేయలేను అని చెప్పేశారట. ఇక వేరే డైరెక్టర్ ని అనుకున్న సమయంలో నాగార్జున గారు మళ్ళీ పిలిచి ఎంత టైం కావాలి స్క్రిప్ట్ వర్క్ కోసం అని అడిగి ఒక ఆరు నెలలు కావాలని దశరథ్ చెబితే సరే తీసుకో మనం సినిమా చేస్తున్నాం. అంతవరకు నేను ఇంకో సినిమా చేయను అని మాటిచ్చి ఆ సినిమా దశరథ్ గారినే డైరెక్ట్ చేయమన్నారట. ఆలా సంతోషం సినిమా చేసానని ఆ సినిమా మంచి హిట్ అవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.































