ఉదయ్ కిరణ్.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత వేగంగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడో.. అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. ఇండస్ట్రీకి పరిచయం అయిన తొలి రోజుల్లోనే వరుస విజయాలతో దూసుకెళ్లాడు. చిత్రం సినిమాతో సినీ కెరీర్ షురూ చేసిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా హిట్ సినిమాలు చేసి టాప్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సంచలన హీరోగా ఎదిగాడు.

చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంటీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల చిన్నోడు.. తొలి మూవీతోనే సూపర్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ కామెడీ సినిమాగా తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం నెలన్నరకే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించాడు. ఈ పాటలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమా అంతా యూత్ చుట్టూ తిరగడంతో యువతీ యువకులను బాగా ఆకట్టుకుంది. ఉదయ్ కిరణ్ కు జోడీగా రీమాసేన్ నటించింది. చిత్రం శ్రీను సహా ఎందరో ఆర్టిస్టులకు ఈ సినిమా మంచి కెరీర్ ను పరిచింది అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకు ముందుగా ఉదయ్ కిరణ్ ను హీరోగా అనుకోలేదు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒకడిగా అనుకున్నారు. హీరోగా మరో కుర్రాడిని ఎంపిక చేశారు. అయితే తను అనుకోకుండా ఈ సినిమా చేయనని చెప్పడంతో ఉదయ్ కిరణ్ ను హీరోగా పెట్టి తీశాడు తేజ. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఈ సినిమాకు గాను తేజ.. ఉదయ్ కిరణ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం రూ. 11 వేలు. అయితే ఈ సినిమా అప్పట్లోనే సంచనల విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర సుమారు 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఉదయ్ కిరణ్ కెరీర్ కు రెడ్ కార్పెట్ పరిచింది.
































