సినిమా అనేది ఒక ఊహా ప్రపంచం.అందులో తళుక్కుమని మెరిసే తారలు ఎందరో. నిజ జీవితానికి, ఊహ ప్రపంచానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రేక్షకుడు, సినిమా చూసిన తర్వాత తారల జ్ఞాపకాలు, మధురానుభూతులు వెంటాడుతూనే ఉంటాయి. తమకు నచ్చిన నటి ఒక్క పాటలో కనిపించిన చాలు అనుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటివారు సినిమాలో అక్కడ అక్కడ కొన్ని సన్నివేశాల్లో కనిపించినా, వారు నర్తించిన ఒక్క పాటైన కూడా ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. తెరపై రేఖ, హేమమాలిని, మాధురి దీక్షిత్, శ్రీదేవి, జయప్రద లాంటివారి తళుకులు, బెళుకులు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

సరిగ్గా అలాంటి కోవలోకే బాలీవుడ్ భామ మందాకిని వస్తుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ఆంగ్లో-ఇండియన్ ఫ్యామిలీకి చెందిన మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. మందాకిని వయసు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రముఖ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ గమనించి తను తీస్తున్న “రామ్ తేరీ గంగా మైలీ” చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు. 1985 రాజ్ కపూర్ దర్శకత్వంలో ఆయన చిన్న కుమారుడు రాజీవ్ కపూర్, మందాకిని “రామ్ తేరీ గంగా మైలీ”లో హీరో, హీరోయిన్లుగా నటించారు. మందాకిని కథ డిమాండ్ మేరకు కొన్ని సన్నివేశాల్లో అర్ధ నగ్నంగా నటించడం ఆనాటి ప్రేక్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

ఇదే సినిమాలో మందాకిని గంగానదిలో స్నానం చేస్తూ..ఒక పాట పాడుతుంది. ఆ పాటలో మందాకిని అందాలకు సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడు ఫిదా కావాల్సిందే. ఈ ఒక్క పాటనే దేశం మొత్తం “రామ్ తేరీ గంగా మైలీ” చిత్రాన్ని చూసేలా చేసింది. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి తో డాన్స్ డాన్స్, గోవిందతో ప్యార్ కర్కే దేకో, ఆదిత్య పంచోలితో కహా హే కానూన్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇదే పరంపరలో మందాకిని దక్షిణ భారత సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.

సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో అత్యంత భారీ వ్యయంతో తీసిన సింహాసనం సినిమాలో “వహవ్వా.. నీ యవ్వనం..” అనే పాటలో మందాకిని తొలిసారి కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత వేడి పుట్టించింది. 1987 శేఖర్ బాబు నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మందాకిని, బాలకృష్ణతో కలిసి నటించింది.

1990 సంవత్సరం వచ్చేసరికి మందాకిని పెళ్లి చేసుకోవడంతో చిత్రాల సంఖ్య చాలా వరకు తగ్గాయి. ఆ తర్వాత మందాకిని ఓ కొడుకు, కూతురుకు జన్మనిచ్చింది. 1996లో జోర్దార్ అనే చిత్రంలో నటించి ఈ “తలుకుల తార” సినిమాలకు దూరమయ్యింది.






























