NBK : తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడుగా నటించి మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కైకాల ఫిలింనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించి వైద్యానికి కూడా సహకరించకపోవడంతో నేడు అనారోగ్య సమస్యలు తీవ్రతరమై కన్నుమూశారు.

కైకాల అంటేనే యమధర్మరాజు పాత్రలు టక్కున గుర్తుకొస్తాయి. ఇలా ఎన్నో సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా నటించి మెప్పించిన కైకాల సుమారు 700 లకు పైగా సినిమాలలో నటించారు. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి కైకాల మరణ వార్త తెలుసుకున్న టువంటి సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

కైకాల మరణం నాకు దిగ్బ్రాంతి కలిగించింది : బాలకృష్ణ
కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను…
-నందమూరి బాలకృష్ణ



























