చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆనాటి టాప్ స్టార్స్ అందరితో నటించడం జరిగింది. అలా నటిస్తూనే కొన్ని సినిమాల్లో ప్రతి కథానాయకుని పాత్రలు వేశారు. ఆ క్రమంలోనే ఆయనలోని తీక్షణమైన కళ్ళు.. సినిమాలోని సంగీతానికి ఆగని ఒళ్ళు.. ఆనాటి దర్శక, నిర్మాతల దృష్టిలో పడడానికి అది చాలా వరకు దోహదపడింది. సమకాలీన, ఆయన ముందు తరం హీరోలందరూ చిరంజీవి డాన్స్ కు ఫిదా అయినవారే.

ఓ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిరంజీవి ప్రస్తావన రాగానే అసలు డాన్స్ సినిమాలలో మొదలుపెట్టింది నేనని అలాంటి డాన్స్ ఇప్పుడు చిరంజీవి వేస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్న హీరోయిన్ ని కాకుండా చిరంజీవినే చూడాలనిపిస్తుంది. నిజంగా ఆయన శరీరంలో బోన్స్ ఉన్నాయా లేదా స్ప్రింగులు ఉన్నాయా అనే సందేహం కలుగుతూ ఉంటుందని వివరించారు.

మామూలు నటుడి స్థానం నుంచి సుప్రీమ్, మెగాస్టార్ వంటి బిరుదులను సొంతం చేసుకోవడానికి ఆయన వేసిన స్టెప్పులే ప్రధాన కారణం. ఆయనకు కమర్షియల్ హిట్ ఇచ్చిన ఖైదీ సినిమాలో “రగులుతుంది మొగలి పొద వగలమారి కన్నె ఎద” అనే పాట మాధవితో చేసిన డాన్స్ ఆనాటి కుర్రకారును కుర్చీలకు అతుక్కు పోయేలా చేసింది. ఇక అక్కడి నుంచి ఆయన స్టెప్పుల పరంపర నభూతోన భవిష్యత్ అనే విధంగా కొనసాగిందనడంలో సందేహం లేదు. 1988 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రంలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా అత్త యముడు అమ్మాయికి మొగుడు నిలిచిపోయింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే బ్రేక్ డాన్స్ లు ఈ సినిమాతోనే ప్రారంభమయ్యాయి.

చిరంజీవి సోలోగా పాడే పాట “మెరుపులా లా.లా ఆడతా.. పిడుగులా.లా.లా రేగుతా..” అనే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ తర్వాత 1990 టి. త్రివిక్రమరావు నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొండవీటి దొంగ సినిమాలో రాధా, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో “చమక్, చమక్ చుట్టుకో.. చుట్టుకో..చాన్సు దొరికే రో హొయ్యా.!” అంటూ చిరంజీవి స్లో డాన్స్ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా అబ్బుర పరిచేలా చేసింది. ఇలాంటి పాటలు చిరంజీవి డాన్స్ డిక్షనరీలో ఎన్నో ఎన్నెన్నో.. ఇదే సంవత్సరంలో అశ్వినీదత్ నిర్మాణము, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులోని పాటలన్నీ ఇళయరాజా స్వరపరిచడం ఒక విశేషం.

ఈ పాటలు చిరంజీవి సినీ కెరీర్ లో రికార్డు స్థాయిలో విజయవంతమయ్యాయి. అందులోని ప్రతి పాట ఆనాడు తెలుగు ప్రేక్షకుల ప్రతి నోట వినబడిందంటే సందేహించనవసరంలేదు. ఈ చిత్రం విడుదలకు “యమహో నీ యమ యమ అందం.. చెలరేగిందే ఎగా దిగా తాపం.!! ” అనే పాట మాత్రమే బ్యాలెన్స్ గా మిగిలిపోయింది. ఆ సమయంలో చిరంజీవికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అయితే నిర్మాత నష్ట పోకూడదన్న ఉద్దేశంతో జ్వరంలో కూడా ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ చేయడంతో నిర్మాత అశ్వనీదత్ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడం జరిగింది. అందుకే చిరంజీవి మెగాస్టార్ అనిపించుకున్నారు.






























