నందమూరి ఫ్యామిలీలో దాదాపు ఇప్పటి వరకు పరిచయం అయిన హీరోలందరు బాగా స్టార్ స్టేటస్ అందుకున్న వాళ్ళే. సీనియర్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన నందమూరి తారకరామారావు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. ఇంకా చెప్పాలంటే ఆయన చేయని పాత్రంటూ లేదు. సాంఘీకం, జానపదం, పౌరాణికం ఇలా అన్నీ రకాల జోనర్స్ లో సినిమాలు చేసి అఖండ విజయాలను అందుకున్నారు. ఓ మహా వృక్షంలా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఓ సామ్రాజ్యాన్నే స్థాపించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్ని విజయాలను చూశారో అందరికీ తెలిసిందే. సినిమాలతో పాటు ముఖ్యమంత్రిగా రాజకీయాలలోను తన సత్తా చాటారు.

అంతటి మహా నటుడికి వారసులుగా ఆయన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ సినిమాలలో హీరోలుగా నటించారు. హరికృష్ణ మధ్యలో లాంగ్ గ్యాప్ వచ్చాక మళ్ళీ సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, లాహిరి లాహిరి లాహిరిలో, సీతా రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. ఇక నట సింహంగా నందమూరి బాలకృష్ణ ఎన్నో సంచలన విజయాలను అందుకుంటున్నారో చూస్తూనే ఉన్నాము. తండ్రి మాదిరిగానే సాంఘీకం, పౌరాణికం, జానపదం ఇలా అన్నీ జోనర్స్‌లో సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు.

బాలయ్య కూడా హీరోగా, రాజకీయ నాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఇక ఆ తర్వాత తరం వాళ్ళైన జూనియర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం, తారక రత్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జూనియర్ ఎన్.టి.ఆర్ తాతకు తగ్గ మనవడిగా ఆయన పోలికలతో నటనతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో ఒక హీరోగా నటిస్తున్నాడు. మరొక హీరోగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నాడు. ఈ భారీ మల్టీస్టారర్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారబోతున్నాడు.

ఇక కళ్యాణ్ రాం హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. కానీ తారక రత్న మాత్రం సినిమాలలో సత్తా చాటలేకపోయాడు. ఆయన హీరోగా ఒకేసారి 10 సినిమాలను ప్రారంభించాడు. కానీ మొదటి రెండు సినిమాలు రిలీజయ్యాక ఆయనతో సినిమాలు చేయాలనుకుని మేకర్స్ దాదాపు డ్రాపయ్యారు. అందుకు కారణం జనాలు హీరోలుగా ఆయనని ఆదరించకపోవడమే. సీనియర్ ఎన్.టి.ఆర్, జూనియర్ ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్ రాం మాదిరిగా తారక రత్న ఆకట్టుకోలేపోయాడు. అందుకే ఈ ఫ్యామిలీలో ఏ రకంగాను సక్సెస్ కాలేకపోయాడు. మధ్యలో క్యారెక్టర్స్ వేసినా కూడా సక్సెస్ కాలేదు. ఇక పై కూడా ఆయన సినిమాలలో రాణించేలా కనిపించడం లేదు.































