వాణి శ్రీ.. ఒకప్పుడు సావిత్రి తర్వాత ఆ స్థాయిలో సినీ పరిశ్రమను ఏక చత్రాధిపత్యంగా ఏలిన నటీమణి. చూడ్డానికి తను నలుపు వర్ణంలో ఉన్నా.. తన అద్భుత నటనతో సినిమా రంగాన్ని ఊపు ఊపింది. తన చక్కటి నవ్వుతో జనాలను విపరీతంగా ఆకట్టుకునేది. తెలుగు వారి ఆరాధ్య తారగా మారిపోయింది. దశాబ్దం పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు సినిమా రంగాన్ని శాసించింది. ఆ సమయమంలో తనతో నటించేందుకు టాప్ హీరోలు సైతం తహతహలాడే వారు.

తొలిసారి చంద్రమోహన్ హీరోగా చేసిన రంగుల రాట్నం సినిమాలో వాణి శ్రీ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకు బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో వాణిశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేయడం చంద్రమోహన్ కు నచ్చలేదు. ఆమెను జూనియర్ ఆర్టిస్టుతో పోల్చిన ఆయన.. వెంటనే హీరోయిన్ ను మార్చాలని దర్శకుడికి చెప్పారట.

తాజాగా చంద్రమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రంగుల రాట్నం సినిమాలో హీరోయిన్ గా వాణి శ్రీణి బుక్ చేశారు దర్శకుడు బిఎన్ రెడ్డి. అప్పటి దాకా తను సైడ్ క్యారెక్టర్లు చేసింది. చెలికత్తె పాత్రల్లో కామెడీ వేశాలు వేసేది. హీరోగా చేస్తున్న తొలి సినిమాలో తనను హీరోయిన్ గా పెడితే.. జూనియర్ ఆర్టిస్టులా ఉంటుందని దర్శకుడికి చెప్పాను. ఒకానొక సమయంలో తను సినిమా పరిశ్రమను ఏలుతుందని ముందుగానే బిఎన్ రెడ్డి జోస్యం చెప్పారని చంద్రమోహన్ చెప్పారు. అనుకున్నట్లుగానే ఆమె కోసం టాప్ హీరోయిన్లు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారూ. బిఎన్ రెడ్డి ముందు చూపు అంత పక్కాగా ఉండేదని చెప్పాడు.

అక్కినేని నాగేశ్వర్ రావు లాంటి హీరో వాణి శ్రీ కోసం వెయిట్ చేసే వారని చంద్రమోహన్ తెలిపారు. నాగేశ్వర్ రావు సెక్రెటరీ అనే సినిమా చేస్తున్నారు. యద్ధనపూడి సులోచనారాణి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ప్రారంభం అయ్యింది. దాన్ని రామారావు ఓపెన్ చేశారు. సెక్రెటరీ సినిమా అక్కడే మొదలయ్యింది. దానికి రాఘవేంద్ర రావు తండ్రి కెఎస్ ప్రకాశరావు దర్శకులు. అందులో చంద్రమోహన్ మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. సెక్రెటరీ షూటింగ్ మొదలయ్యింది. వాణి శ్రీ అప్పుడు మంచి ఊపుమీదుంది. 9 గంటలకు రావాల్సి ఉన్నా.. 11 గంటలకు వచ్చేది. ఆమె కోసం నాగేశ్వర్ రావు సహా మిగతా నటీనటులు బయట కూర్చుని వెయిట్ చేసేవారని చంద్రమోహన్ వెల్లడించారు.



























