సినిమా ఇండస్ట్రీలో కొత్త వారు పరిచయమవడం సాధారణమే అయినా.. ఎంకరేజ్ చేసేవాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఫాంలో ఉన్నవాళ్ళైతే.. మరీ ఫోజులు కొడుతుంటారు. మొదటి సినిమా అవకాశం కోసం చెప్పులు అరిగేలా తిరిగీ వాళ్లకి కొత్తగా వచ్చేవాళ్ళ కష్టాలు, బాధలు తెలుస్తాయంటారు. కానీ ఏ కష్టం పడకుండా లక్కీగా అవకాశం వచ్చిన వాళ్ళు సక్సెస్ వచ్చినవాళ్ళని సహాయం అడిగితే.. అబ్బే నువ్వుంకా నేర్చుకోవాలమ్మా.. కొన్నాళ్ళు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయ్ అని సోది చెప్పి కొన్నాళ్ళు వాడుకొని వదిలేస్తారు. ఇలా వాడుకున్న సమయంలో టీ పెట్టించుకొనే దగ్గర్నుంచి నానా చాకిరి చేయించుకుంటుంటారు. అయినా భరించి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో రాణించాలనే తపనతో అన్నీ పనులు చేయడానికి సిద్దపడుతుంటారు.

అయితే కొందరు మాత్రం పక్కవాడిని, సహాయం కోరి వచ్చిన వాడిని చులకనగా చూడటం తప్పు, పాపం అని తమకి వీలైనంత సహాయం చేసి గొప్ప స్థాయికి తీసుకు వచ్చిన దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రఫ్ర్స్, డాన్స్ మాస్టర్స్ కొందరున్నారు. మన వల్ల అయినంతవరకు కొత్తవాళ్ళకి అవకాశం కల్పించి ఇండస్ట్రీకి పరిచయం చేసి లైఫ్ ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి పాటలు పాడటం తో పాటు వరంగల్ లో చదువుతున్నప్పుడు విజయలక్ష్మిగారు, తిరుపతయ్యగార్ల వద్ద వయొలెన్ నేర్చుకున్నారు చక్రి. అలాగే ఓకల్ కూడా నేర్చుకున్నారు. అదే చక్రి నేర్చుకున్న సంగీత పరిజ్ఞానం.

ఇక చక్రికి ఓ ట్రూప్ ఉండేది. దాని పేరు ‘సాహితీ కళాభారతి’. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ‘ఒకే జాతి మనదిరా… ఒకే బాట మనదిరా’ అనే పాటను చక్రి స్వయంగా రాసి, స్వరపరిచి పాడాడు. అది అందరికీ విపరీతంగా నచ్చేసింది. అలా చక్రి టాలెంట్ బయటకి వచ్చి తన స్నేహితులందరు, ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది.. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎంకరేజ్ చేశారు. అలా చక్రి హైదరాబాద్ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనే స్వయంగా పాటలు రాసి, కంపోజ్ చేసిన 8 పాటలతో ‘చిరునవ్వు ‘ ఆల్బమ్‌ని తయారు చేశారు. ఆ ఆల్బమ్ విన్న చిరంజీవి, చక్రిని చాలా మెచ్చుకున్నారు. ఆ అల్బమ్‌లోని పాటల్ని ‘చల్లగాలి’ అనే కలంపేరుతో చక్రే రాశారు. దాంతో చక్రికి సినిమా అవకాశాలు వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి (2000) సినిమాతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రయాణం మొదలైంది. ఇతర సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా చేయకుండానే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు.

అంతేకాదు ఆయన మొదటి సినిమా నుంచి ప్రతీ సినిమాతో ఓ కొత్త సింగర్ ని పరిచయం చేయాలని డిసైడయ్యాడు. అలా ఆయన సినిమాల ద్వారా 60 నుంచి 70 మంది వరకు కొత్త సింగర్స్‌ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. వారిలో ప్రముఖ సింగర్ కౌసల్య లాంటి వారున్నారు. కొత్త సింగర్స్ ని చక్రి ఎంకరేజ్ చేసినట్టు మిగతావాళ్ళు చేయలేదనే మాటా ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుంది. ఇక చాలా కాలం పూరి జగన్నాథ్ సినిమాలకి పని చేస్తూ ఆయనతో జర్నీ చేసిన చక్రి ఎన్నో సూపర్ హిట్ అల్బమ్‌స్ ఇచ్చారు. వాటిలో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలలో అన్నీ పాటలు సూపర్ హిట్ అయినవి ఉన్నాయి. అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయిలో నీవే నీవే నీవే ..నేనంటా అనే పాట ఇప్పటికీ వినిపిస్తుంది.



























