తాజగా తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపద్యంలో లాక్ డౌన్ సందర్బంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినేట్ ఆదేశించింది. దీనితో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో సన్నద్దమై జూలై 1 నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అద్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనాను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది.

ఈ క్రమంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను యధావిధిగా పాటించాలని కోరింది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.






























