త్రివిక్రమ్ తన మాటల తూటాలతో నిద్రపోతున్న సమాజాన్ని ప్రశ్నిస్తాడు మళ్ళీ తానే జవాబిస్తాడు. ప్రతి సినిమాలో లాజిక్ సంభాషణతో కట్టిపడేస్తాడు. మరో సినిమా వచ్చేసరికి లాజిక్ కాదు మ్యాజిక్ చూడాలి అంటాడు. జంధ్యాల గారి చిత్రాల్లోలా కొంత వరకు వెటకారం కనిపించిన త్రివిక్రమ్ సెటైరికల్ గా చెప్పి తాను సృష్టించిన మరో పాత్ర చే బ్యాలెన్స్ చేస్తూంటాడు. 2010లో మాటల మాంత్రికుడి మంత్రదండం లోంచి వచ్చిన ఫిలాసఫీకల్ మూవీ ఖలేజా.

మహేష్ బాబు అనుష్క కాంబినేషన్ లో మంచి హైప్ తో వచ్చిన ఖలేజా మూవీనీ ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. త్రివిక్రమ్ మంచి కథతో వచ్చి బడ్జెట్ విషయంలో వెనకాడకుండా తీసిన సినిమా వెండితెరపై ఫెయిల్యూర్ గా నిలిచి బుల్లి తెరపై మాత్రం ఎందుకు విజయవంతం అయ్యిందో కొన్ని కారణాలను చూద్దాం.

1). ఖచ్చితమైన జానర్ లో రాకపోవడం :
ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన జానర్లో విడుదలవుతుంది. కామెడీ, యాక్షన్, ట్రాజడి, హారర్, ఇలా ఒక సినిమా ఏదో ఒక జానర్ కు సంబంధించినదై ఉంటుంది. కానీ ఖలేజా సినిమా ఏ జానర్ కు సంబంధించినదో ఖచ్చితంగా చెప్పలేకపోవడం.

2) దేవుడు కాని మనిషి:
ఆపదలో ఆదుకునే వాడే దైవాంశ సంభూతుడు అని సందర్భాన్ని బట్టి ఆ దేవుడు బయటకు వస్తాడని త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసుకున్న ప్పటికీ తోటి పాత్రలతో మహేష్ బాబును ప్రతిసారి దేవుడనిపించడంతో మనిషి దేవుడు ఎలా అవుతాడు అని ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు.

3). నేటివిటీ మిస్ కావడం:
దైవం మరియు మనిషి అనే విషయాలను తీసుకున్నప్పటికీ చెప్పే కథను తెలుగు నేటివిటీ ని కాదని ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాన్ని ఎన్నుకొని తెలుగు నేటివిటీని పక్కన పెట్టడంతో తెలుగు ప్రేక్షకులు ఆ కథకు కనెక్ట్ కాలేకపోయారు.

4). సమస్యాత్మక గ్రామాన్ని చూపించకపోవడం
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో కొరటాల తీసుకున్న దేవరకొండ గ్రామాన్ని చూపిస్తూ ఊరి ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు తీశాడు. కానీ ఖలేజా సినిమాలో ప్రజలు కనిపిస్తారు వారి గ్రామం ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

5). సీరియస్ సీన్లను కామెడీగా చెప్పడం:
ఖలేజా సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కథ సీరియస్ గా నడుస్తూ ఉంటుంది. మహేష్ బాబు మధ్యలో కామెడీ చేస్తుంటాడు. ఇది సగటు ప్రేక్షకుడికి నవ్వు రాకపోగా విసుగు వెగటు పుట్టిస్తోంది.

6). అరుంధతి అనుష్క:
ఖలేజా సినిమాకంటే ముందే అనుష్క అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి తిరుగులేని ఉన్నత మైన రాజసం ఒలికే పాత్ర చట్రంలో ఇరుక్కుపోయారు. తిరిగి ఖలేజా సినిమాలో సాదాసీదా పాత్రలో అనుష్క కనిపించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.



























