ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బడా హీరోల సినిమాలకి పని చేశారు తేజ. ఆయన సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన సినిమాలు ఆయనకి చాలా మంచి పేరును తీసుకు వచ్చాయి. హిందీలో స్టార్ హీరోల సినిమాలకి పనిచేసిన తేజ కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా చేశారు. కానీ ఆయనకి టైటిల్ కార్డ్ లో పేరు గాని అదనంగా రెమ్యునరేషన్ గాని నిర్మాతలు ఇచ్చింది లేదు. అలా చాలా సినిమాలకి జరిగిందట. సినిమాటోగ్రఫీ అందిస్తూనే, కొన్ని సీన్స్ ఆయనే తెరకెక్కించారట. దర్శకుడు మాత్రం ఆ సీన్స్ కి వచ్చిన క్రెడిట్ పొందాడని వెల్లడించారు తేజ.

అయితే తనకి డైరెక్షన్ చేయడం తెలిసిందని అర్థం చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేశారు. ఆ ప్రయత్నాలలో ప్రముఖ నిర్మాత రామోజీరావును కలిసి చిత్రం కథ వినిపించారు. బడ్జెట్ అడిగితే 35 లక్షలు అవుతుందని చెప్పారట తేజ. అలా అంతా కొత్త వాళ్లతో చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు. హీరో, హీరోయిన్స్ ఉదయ కిరణ్, రీమా సేన్..అలాగే ఇతర నటీ నటులను అంతా కొత్తవారిని తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఆర్.పి.పట్నాయక్, గీత రచయితగా కుల శేఖర్ ని తీసుకు వచ్చారు. అంతా కొత్త టీం తో చేసిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. చెప్పాలంటే ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక కొత్త వొరవడిని తీసుకు వచ్చింది.

35 లక్షల్లో సినిమా ఎలా తీస్తాడని ఆశ్చర్యపోయిన రామోజీ రావుకు 10 కోట్ల వరకు లాభం తెచ్చిపెట్టాడు. దాంతో తేజ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. వరుసగా పెద్ద నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇచ్చాయి. ఇక తేజ కూడా మొదటి చిత్రానికి పనిచేసిన వారినే ఆ తర్వాత సినిమాలో కంటిన్యూ చేశాడు. అలా ఆర్.పి.పట్నాయక్ తేజ దర్శకత్వంలో వచ్చిన అన్నీ సినిమాలకి బ్లాక్ బస్టర్ అయ్యే మ్యూజిక్ అందించాడు. తేజ – పట్నాయక్ ది హిట్ కాంబినేషన్ అని అందరూ చెప్పుకున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయింది అంటే సంగీత దర్శకుడిగా ఆర్.పి.పట్నాయక్ పేరు పోస్టర్ మీద ఉండాల్సిందే.

అయితే ఒక్కసారిగా తేజ – ఆర్.పి.పట్నాయక్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా కాలం ఎందుకు వీరు విడిపోయారనేది అర్థం కాలేదు. కొంతకాలానికి తేజ స్వయంగా వెల్లడించారు. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడిగా చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. అతను అద్భుతమైన పాటలు ఇస్తాడు. అది వదిలేసి డైరెక్షన్ వైపు వెళ్ళడం నాకు నచ్చలేదు. అని ఓపెన్ అయ్యాడు. డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు. కానీ పట్నాయక్ కి దానికి మించిన టాలెంట్ మ్యూజిక్ లో ఉంది. దాన్ని వదిలేసి డైరెక్షన్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని తెలిపాడు. ఈ కారణంగానే మా మధ్య గ్యాప్ వచ్చింది తప్ప వేరే కారణాలేవీ లేవని తెలిపాడు.

తేజ చెప్పినట్టుగా ఆర్.పి.పట్నాయక్ డైరెకర్ గా అంత సక్సెస్ కాలేదు. సంగీత దర్శకుడిగా సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే మళ్ళీ వీరిద్దరు కలిశారు. నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ ని తేజ హీరోగా లాంఛ్ చేస్తున్నాడు. దీనికి సంగీత దర్శకుడిగా ఆర్.పి.పట్నాయక్ కి అవకాశం ఇచ్చాడు తేజ. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. చూడాలి మరి హిట్ కాంబోలో డెబ్యూ హీరోకి ఎలాంటి హిట్ ఇస్తారో. కాగా ఆర్.పి.పట్నాయక్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.



































