సినిమా.. ఒక్క రోజులో జీవితాలను మార్చేస్తుంది.. నిన్నటి వరకు ఎవరికీ తెలియని వ్యక్తులు రేపు స్టార్ లుగా ఎదగవచ్చు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న వారు కాలగమనంలో కలిసిపోవచ్చు. చరిత్ర పుటల్ని తిరాగేస్తే అలాంటి సంఘటనలు ఎన్నో.. ఇక ‘ఒక్క ఛాన్స్’ కోసం ఎదురు చూసేవాళ్ళెందరో. ఛాన్స్ లు వస్తున్నా, కష్టపడినా సరైన విజయాలు లేక గుర్తింపు కోసం తాపత్రయ పడే వాళ్ళు ఇంకెందరో. కానీ, ఒక్క సినిమా, ఒక్క డైలాగ్ తో జీవితాలు మారిపోయిన నటులు కొందరున్నారు. అలీ “చాట కథ” నుంచి ప్రియదర్శి “న చావు నేను చస్తా” వరకు ఎందరో అలా పేరు తెచ్చుకున్నవాళ్ళే. ఇప్పుడు ఆ జావితాలోకి చేరారు కుమనన్ సేతు రామన్.
మహేష్ బాబు కథానాయకుడుగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది’ అంటూ ఒక్క డైలాగ్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు కుమానన్. అలాగని ఆయన ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటుడేమీ కాదు. గత 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ గా, నటుడుగా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే, ఇన్నేళ్ళుగారాని గుర్తింపు ఒక్క డైలాగ్ తో ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది.



























