విజయశాంతిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఆమెకి నటన పరంగా గొప్ప కెరీర్ ఇచ్చింది మాత్రం డైరెక్టర్ టి.కృష్ణ. ఆయన దర్శకత్వంలో విజయశాంతి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి.. టి.కృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 1983లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమా ‘నేటి భారతం’. ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించింది. టి.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయశాంతి, సుమన్ జంటగా నటించారు.

నాగభూషణం, పి.ఎల్.నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కె.చక్రవర్తి సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ తరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించారు. అయితే అప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా విజయశాంతి కెరీర్లో ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఆమె కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా. ఇదే సినిమాను 1985లో హిందీలో ‘హక్వీక్వత్’గా, 1985లో తమిళంలో ‘పుతియ తీర్పు’గా రిమేక్ చేశారు. తెలుగులోనే గొప్ప సక్సెస్ సాధించింది.

కాగా ఈ సినిమా సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను విజయశాంతి తెలిపారు. నా నటనకు పునాది పడింది ‘నేటి భారతం’ సినిమాతోనే అన్నారు. ఈ సినిమా దర్శకులు టి.కృష్ణ గారి మైండ్ సెట్‌కి, ఆయన ఆలోచనకి విజయశాంతి కరెక్ట్‌గా సూటవుతుంది తప్ప మరెవరూ కాదని గట్టిగా నిర్ణయించుకున్నారట. వేరే హీరోయిన్‌తో చేయాలని లేదు అని తన సన్నిహిత వర్గాల వద్ద కూడా చెప్పారట. ఓసారి ఆరోగ్యం బాగోలేక కొడుకు కోడలు దగ్గరికి వెళ్ళారు. అమెరికాలో ఉన్నప్పుడు నేను ఆయనని చూడటానికి వెళ్ళాను. అక్కడ తన ఫ్యామిలీతోనే కొన్ని రోజులు ఉన్నాను. అందరితో నన్ను ‘ఏలియన్స్’ సినిమాకి తీసుకు వెళ్ళారు.

ఆ సమయంలో టి.కృష్ణ గారి ఆరోగ్యం అంత బాగోలేకపోయినా సినిమా చూపించి ..అమ్మా శాంతమ్మ ఆ అమ్మాయి చూశావా ఎలా ఫైట్స్ చేస్తుందో..ఒకరోజు నువ్వు కూడా అలా ఫైట్స్ చేయాలి అన్నారు. అలా ‘నేటి భారతం’ సినిమాకి అప్పుడే బీజం పడింది. ఆయన నన్ను ఒక అన్నగా.. ఒక గురువుగా చాలా కేరింగ్‌గా చూసుకునేవారు. ఈ క్యారెక్టర్ మా శాంతమ్మనే చేయగలుగుతుంది అని చాలా నమ్మకంగా అందరికీ చెప్పేవారు. ‘ప్రతి ఘటన’ సినిమాకి కూడా నా డేట్స్ కుదరకపోతే వెయిట్ చేశారు తప్ప వేరే వారితో చేయడానికి ఒప్పుకోలేదు. చాలామంది పేర్లు పరిశీలించినా..చివరికి నాతోనే చేయించారు. ఆయనకి నా మీద అంత నమ్మకం. మా కాంబినేషన్ లో ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘రేపటి పౌరులు’, ‘దేవాలయం’.. వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. టి.కృష్ణ గారి సినిమాలంటే నటనకు స్కోప్ ఉంటాయి. జీవితంలో ఆయనని ఎప్పటికీ మర్చిపోను..అని విజయశాంతి అన్నారు. కాగా ఆమె దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.



























