దేశంలో దొంగబాబాల దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. దేశ రాజధానిలోని ‘ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ’ ఆశ్రమంపై మంగళవారం రాత్రి పోలీసు అధికారులు దాడులు చేశారు. దీంతో ఆశ్రమంలోని బాలికలు, మహిళలపై సాగుతున్న దౌర్జన్యకాండ బయటపడింది. ఈ ఆశ్రమాన్ని వీరేంద్ర దేవ్ దీక్షిత్ 1970 నుంచి నడుపుతున్నాడు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఆధ్యాత్మిక్ సంస్థ బ్రాంచీలు ఉన్నాయి.

తమ కూతుళ్లను దీక్షిత్ ఆశ్రమంలో బంధించి లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ పలువురు తల్లిదండ్రులు ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సదరు ఆశ్రమంపై దాడులు చేయాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం దాడులు నిర్వహించిన బృందంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఉన్నారు. ఆశ్రమంలోని 100 మంది బాలికలు, మహిళలకు బృందం విముక్తి కల్పించింది. దీక్షిత్ సెక్యూరిటీ గార్డు, మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీక్షిత్ బాబా పరారీలో ఉన్నాడు. సోదాలకు ముందు పోలీసులకు, దీక్షిత్ అనుచరులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆశ్రమంలోని ఓ గది నిండా ఉన్న మెడిసిన్స్, సిరంజీలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో ఉండే మహిళలందరినీ ‘గోపీయాన్’గా పిలుస్తుంటారని తెలిసింది. వారంతా గులాబీ రంగు చీరలతో ఉండాల్సిందేనని కఠినమైన ఆదేశాలుంటాయి.

దీక్షిత్.. తనకు నచ్చిన అమ్మాయిలను లొంగదీసుకొని వారిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడమే కాక, వారిని వేధింపులకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతాడని బాధితులు వెల్లడించారు. అంతేకాకుండ ఆశ్రమంలో రహస్య గదులు, ఎవరూ బయటకు పారిపోకుండా పకడ్బందీ ఏర్పాట్లున్నట్టు పోలీసులు గుర్తించారు. దీక్షిత్ వేధింపులు తాళలేక ఐదుగురు బాధితులు ఆశ్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు పోలీసులకు వెల్లడించారు.

వారం రోజుల కోర్సు నిమిత్తం భక్తులు తమ కూతుళ్లను ఆశ్రమంలో విడిచి వెళ్తుంటారని దీక్షిత్ మాజీ శిష్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. అలా వదిలి వెళ్ళీన అమ్మాయిలపై బాబా లైంగికదాడికి పాల్పడటమే కాక, వారిని తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడని చెప్పారు. అంతేకాక, పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలని భక్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడని తెలిపారు.

కొందరు భక్తుల ఆస్తులను సైతం బలవంతంగా దీక్షిత్ తనపేర రాయించుకున్నట్టు తెలిసింది. తన కూతురును ఢిల్లీ ఆశ్రమంలో వదిలి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో కనిపించిందని ఓ విశ్రాంత పోలీసు అధికారి వాపోయారు. ఇంతకు ముందు సాధ్విలపై లైంగికదాడి కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ 20 ఏండ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.



























