కుక్కపిల్ల,అగ్గిపుల్ల,సబ్బుబిల్ల, కాదేదీ కవితకనర్హం..అన్నట్టుగా అందం,అంగవైకల్యం, నలుపు,తెలుపు ఇవి ఎప్పుడూ నటనకు అడ్డురావు.ఇలాంటి కోవలోకే కళ్ళు చిదంబరం వస్తాడు. ఆయన నటనతో విమర్శకుల ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. విశాఖపట్నంకు చెందిన కళ్ళు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం. ఈయన వైజాగ్ పోర్టు ట్రస్టులో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో… స్నేహితులతో కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 1988లో ప్రముఖ ఫోటోగ్రాఫర్, దర్శకుడు ఎం.వి.రఘు నూతన నటీనటులతో కళ్ళు అనే చిత్రాన్ని నిర్మిద్దాం అనుకున్న సమయంలో కళ్ళు చిదంబరంను చూడడం జరిగింది.

గొల్లపూడి మారుతీరావు రాసిన కళ్ళు అనే నాటకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ నాటకాన్ని చూసిన ఎం.వి.రఘు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆ నాటకాన్ని సినిమాగ రూపొందించడం జరిగింది.మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. కళ్ళు అనే సినిమాలో చిదంబరం నటించడంతో ఆయనకి మొదటి సినిమా పేరే ఆయన ఇంటి పేరు అయ్యింది. తాను ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బును ఇంట్లోకి ఖర్చు పెడుతూ.. సినిమాల్లో నటిస్తే వచ్చిన పారితోషికాన్ని పేదలకు, అనాధలకు ఖర్చు చేసేవారు. ఆయన ఈ.వి.వి.సత్యనారాయణ ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా నటించారు.

కళ్ళు సినిమా అనంతరం ఆయనకు బాగా పేరు తీసుకువచ్చిన చిత్రం అమ్మోరు.వివరాల్లోకి వెళితే…1994 లో వైజయంతి మూవీస్ బ్యానర్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గోవింద గోవింద చిత్రంలో నాగార్జున, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి, కళ్ళు చిదంబరంతో నటించే సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ముందుగా కళ్ళు చిదంబరంతో ఒక సన్నివేశం ఉంటుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవికి వివరిస్తుండగా.. తను కళ్ళు చిదంబరంతో నటించనని శ్రీదేవి ఖరాఖండిగా చెప్పేసింది. కానీ రామ్ గోపాల్ వర్మ కళ్ళు చిదంబరం.. మామూలు వ్యక్తి కాదు ఓ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనతో నటించడం తప్పేంటి అని చెప్పడంతో.. చివరికి శ్రీదేవి కళ్ళు చిదంబరంతో “గోవిందా గోవిందా” అనే చిత్రంలో నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

































