తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజండరీ నటుల్లో గిరిబాబు ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాత గా కొనసాగారు. కెరిర్ ప్రారంభంలో విలన్ పాత్రల్లో నటించి ఆయన ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగానూ నటించారు. గిరిబాబు దాదాపు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని పలు ప్రధాన భాషలలో రూపొందిన సినిమాలలో నటించారు. గిరిబాబు కెరీర్ లో ఎక్కువగా చేసింది విలన్ రోల్స్ నే. ఆ తర్వాత హాస్యనటుడుగా ఎన్నో పాత్రలు పోషించి కడుపుబ్బా నవ్వించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు ఎన్నో ఉన్నాయి.

గిరిబాబుకు చిన్నప్పటి నుండే నాటకరంగం మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. దాంతో పలు నాటకాలలో పాత్రలు పోషించి బాగా పేరు తెచ్చుకున్నారు. అదే ఆయన నటుడవడానికి మార్గం చూపించింది. నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. గిరిబాబు 1973 లో జగమే మాయ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి మంచి పేరు రావడంతో ఇక కెరీర్ లో వెనక్కి తిరిగి చూసూకునే అవసరం రాలేదు. 1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా, దర్శకుడుగా మారాడు. గిరిబాబు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానూ బాగా సక్సెస్ అయ్యారు.

ఆయన దర్శకత్వంలో సింహగర్జన, మెరుపుదాడి, రణరంగం లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక గిరిబాబు కెరీర్ ప్రారంభంలో ఇప్పుడు కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబుతో రూం షేర్ చేసుకున్నారు. ఆ రోజుల్లో రూం అద్దే 40 రూపాయలు. అయితే ఇద్దరిలో ముందు నటుడయింది గిరిబాబు. ఆ తర్వాత భక్తవత్సలం నాయుడుని మోహన్ బాబు గా పేరు మార్చి దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు స్వర్గమ నరకం సినిమా ద్వారా పరిచయం చేశారు. ఇక గిరిబాబుకి సూపర్ స్టార్ కృష్ణతో మంచి బాండింగ్. వీరిద్దరి కాంబినేషన్ లో 150 సినిమాలొచ్చాయంటే నమ్మితీరాల్సిందే.

కృష్ణ తో కలిసి సింహగర్జన సినిమాలో నటించారు. అలాగే రకరకాల పాత్రలు పోషించారు. గిరిబాబు అనీ రకాల పాత్రల్లో నటించారు. ఏ పాత్రల్లో నటించడం మీకు సౌకర్యంగా ఉంటుందని అడిగే ..నాకు అన్నీ పాత్రలు సౌకర్యంగానే ఉంటాయని చెప్పారు. అంటే ఆయనకి వచ్చిన ప్రతీ పాత్రను ఎంతో ప్రేమించి ఇష్టపడి చేశారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పారు. ఇక ఆ తరం నటుల్లో మురళీ మోహన్, మోహన్ బాబు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలతో మంచి అనుబంధం ఏర్పడింది. కాగా గిరిబాబు గారు 600 పై చిలుకు చిత్రాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాగే నిర్మాతగా 10 సినిమాలను నిర్మించారు.

ఇక ఆయన సినిమాలకి ఆయనే కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశారు. చిన్నప్పటి నుంచి కథ రాసుకోవడం వలనే ఇతరుల కథలను తీసుకోలేదట. ఆయన డైరెక్ట్ చేసిన అన్నీ సినిమా లను సొంత కథతోనే తీశారు. దర్శకుడిగా 8 సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో ముందు వచ్చింది ఇంద్రజిత్. అలాగే దేవతలారా దీవించండి సినిమాకి డైరెక్షన్ ఆయనే చేసినప్పటికి పేరు మాత్రం వేరేవారిది వేశారు. అయితే ఆయన పేరు గిరిబాబుగా మారడానికి కారణం కెరీర్ ప్రారంభంలో నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. ఆ సినిమాలకి ఆయన పేరు శేషగిరిరావుగా వేసుకున్నారు. వరుస సినిమాలు ఫ్లాపవడం వల్ల పేరు మార్చి గిరిబాబుగా మార్చారు. ఈ పేరును గిరిబాబు తాతయ్య పిలిచేవారట. అందుకే ఆయన స్క్రీన్ పేరును గిరిబాబుగా మార్చుకున్నారు.



























