సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు అనగానే వెంటనే మనకు ప్రిన్స్ మహేష్ బాబు గుర్తుకొస్తాడు. నిజానికి అది పూర్తిగా నిజం కాదు. తన కంటే ముందే కృష్ణ నట వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఆయన పెద్దకొడుకు రమేష్ బాబు. సామ్రాట్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసా అద్భుత సినిమాలు చేశాడు. బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తను నటించిన చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఎన్ కౌంటర్ సినిమా తర్వాత ఆయన సినిమాలకు దూరం అయ్యాడు.

రమేష్ బాబు హీరోగా మొదలైన పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి కూడా. అందులో ప్రధానంగా రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి సాహసయాత్ర. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు పాటలు, పలు సీన్లు షూట్ చేశారు. అప్పటికే ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు మారారు. తొలుత ఈ సినిమాకు వంశీ దర్శకుడిగా పనిచేశాడు. రైటర్ సాయినాథ్ తో కలిసి పూర్తి ఎడ్వంచర్ మూవీగా తీయాలనుకున్నారు. మబ్బు చంద్రారెడ్డి సమర్పణలలో నూరా రవీంద్రారెడ్డి, టీవీఎస్ రెడ్డి నిర్మాతలుగా ఓకే చెప్పారు. కృష్ణకు కథ నచ్చింది. దీంతో రమేష్ బాబు హీరోగా సినిమా పనులు ప్రారంభం అయ్యాయి.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఇళయరాజా ఓకే అయ్యాడు. హీరోయిన్ ఎంపిక కాలేదు. విలన్ గా అమ్రిష్ పురి ని తీసుకున్నారు. సినిమా షెడ్యూల్స్ ఖరారు అయ్యాయి. ఈలోగా ప్రొడ్యూసర్స్ కి, వంశీకి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో సినిమా నుంచి వంశీ లెఫ్ట్ అయ్యాడు. అనంతరం కె ఎస్ ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమా కథ మారింది. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాలోకి వచ్చారు. హీరోయిన్స్ గా గౌతమీ, మహాలక్ష్మి, రూపిణి సెలెక్ట్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కోటికి అవకాశం ఇచ్చారు. సినిమా షూటింగ్ మొదలయ్యింది. అండమాన్ లో రమేష్ బాబు-గౌతమీ, రమేష్-మహాలక్ష్మి మీద మొత్తం రెండు పాటలు తీశారు. ఆ తర్వాత మనీ ప్రాబ్లంతో ఈ సినిమా ఆగిపోయింది.
































