ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రిస్కీ షాట్లు హీరోలు చేసేవారు కాదు.. డూప్ లు మాత్రమే ఆ పని చేసేది. ఎలాంటి ఇబ్బందికర సీన్లలోనూ నటించేవారు కాదు. ఏమాత్రం కష్టం కలుగుతుంది అని భావించిన డూప్ అరేంజ్ చేసేవాళ్లు దర్శకులు. కానీ తొలిసారి డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాల్లో మాగ్జిమం డూప్ లు లేకుండా తనే రిస్కీ షాట్లు చేసేవారు. తెలుగులో యాక్షన్ స్టార్‌గా మారిపోయారు. కిరాయి రౌడీలు, కిరాతకుడు సినిమాల సమయం నుంచి ఆయన పలు యాక్షన్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించారు. అయితే ఆయన చేసే రిస్కీ షాట్లను చూసి దర్శకులు సైతం భయపడ్డ సందర్భాలున్నాయట.

హిందీ సినిమా ‘ద జెంటిల్‌మన్’ సెట్స్ పై ఓ అనూహ్య ఘటన జరిగిందట. అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెంటిల్ మెన్’ సినిమాకు ఈ చిత్రం రీమేక్. దీనిని హిందీలో బాటీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి భుజం కింద ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లే సీన్ ఉంటుంది. ఒక రాడ్డుకు స్పిరిట్ ముంచిన దూదిని చుట్టి.. దానితో బుల్లెట్ తగిలిన చోట వెనుక వైపు నుంచి ఆ రాడ్డుతో పొడుస్తాడు చిరంజీవి. అప్పుడు బుల్లెట్ బయటకు వస్తుంది. ఆ గాయాన్ని మాన్పేందుకు గన్ పౌడర్ గాయం మీద వేసి అంటించుకుంటే క్రాకర్ పువ్వొత్తిలా వెలుగుతుంది. దీంతో గాయం మానిపోతుంది.

ఈ రిస్కీ సీన్ తానే చేస్తానని చెప్పాడు చిరంజీవి. అందుకు మహేష్ భట్ వద్దని చెప్పారట. డూప్ తో చేయిద్దామన్నారట. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. అయితే తను ఈ సీన్ చూడలేనని అక్కడి నుంచి వెళ్లిపోయారట భట్. చిరంజీవి తన తోడల్లుడు డాక్టర్ కె. వెంకటేశ్వరరావును పిలిపించుకున్నారట. ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్ ను దగ్గర పెట్టుకున్నారు. తన భుజం మీద రక్తంలా కనిపించే ఎర్రరంగు పూయించారు. దానిపై గన్‌పౌడర్ రాశారు. సెట్లో ఉన్నవాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. కెమెరా రోల్ అవుతోంది.. గన్‌పౌడర్ మీద మంట వెలిగించారు. గన్‌పౌడర్ బర్న్ అయ్యి మంట మండింది. బాధను భరిస్తున్నట్లు చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు. కాసేపటికి దర్శకుడు లేడని తెలిసి ఆమంటను ఆర్పుకున్నాడు. సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్ల మోత మోగించారు. కానీ తర్వాత చూస్తే చిరంజీవి చేయి కాలింది. వెంటనే వెంకటేశ్వర్ రావు చికిత్స చేశాడు. ఇలాంటి సీన్లు చిరంజీవి చాలా సినిమాల్లో చేయడం విశేషం.
































