టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా, అప్పటి రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టించింది. మహేష్ బాబు కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. ఆయనను పూర్తిగా మాస్ హీరోగా పరిచయం చేసిన సినిమా ఇదే అని చెప్పాలి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజునుంచే భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా మహేష్ బాబు పోషించిన ‘పండుగాడు’ పాత్ర, ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్లో ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.
అయితే ఈ సినిమా ప్రారంభంలో మహేష్ బాబును హీరోగా అనుకోలేదని తెలుస్తోంది. కథ రాసేటప్పుడు రవితేజను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. కానీ అప్పట్లో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ఈ సినిమాను చేయలేకపోయాడట. ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు చేతికి వెళ్లింది.
హీరోయిన్ ఎంపికలో కూడా ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ సినిమాలో నటించేందుకు ఆయేషా టాకియా ను సంప్రదించారని తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత కంగనా రనౌత్‌ను ఎంపిక చేసినప్పటికీ, చివరి నిమిషంలో ఆమె కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో చివరకు ఇలియానా డి’క్రూజ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై, తన కెరీర్‌లో పెద్ద బ్రేక్ అందుకుంది.
ఈ విధంగా పలువురు నటీనటులు వదిలేసిన ఈ సినిమా, చివరకు మహేష్ బాబు – ఇలియానా కాంబినేషన్‌తో తెరకెక్కి ఘన విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ తగ్గకపోవడం, దాని ప్రభావం ఎంత గొప్పదో చెప్పే విషయం. ‘పోకిరి’ కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ ట్రెండ్‌ను మార్చిన మైలురాయి అనే మాటలో ఎలాంటి సందేహం లేదు.
































