విక్టరీ వెంకటేశ్‌కి రీమేక్ కింగ్ అని పేరుంది. ఆయన తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాల సూపర్ హిట్స్ ని ఇక్కడ రీమేక్ చేశారు. ఆయన పరభాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు రీమేక్ చేసి ఎక్కువగా సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సూపర్ గుడ్ ఫిలింస్, సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో ఎక్కువగా వెంకటేశ్ నటించిన రీమేక్ సినిమాలు నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించాల్సిన కలియుగ పాండవులు సినిమా ఆయనకి డేట్స్ కుదరకపోవడంతో వెంకటేశ్ తో నిర్మించాలనుకున్నారు.

అప్పుడే యూఎస్ నుంచి వెంకటేశ్ సినీ ఎంట్రీ అనూహ్యంగా జరిగింది. పక్కాగా ప్లాన్ ప్రకారం వెంకటేశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఎంట్రీ తర్వాత మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకొనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొదటి సినిమా కలియుగ పాండవులు సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు నిర్మించారు. ఖుష్బూ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత బ్రహ్మరుద్రుడు సినిమాలో నటించిన వెంకటేశ్ అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ఇలా వరుసగా వెంకటేశ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే రెండవ సినిమా, మూడవ సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. ఇక మూడవ సినిమానే హిందీలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేశారు. అలాగే నాలుగవ, అయిదవ సినిమాలు ఫ్లాప్. వెంకటేశ్ కాబట్టి..పెద్ద ఫ్యామిలీ హీరో కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు. వీటి తర్వాత శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత బ్రహ్మపుత్రుడు సినిమాతో మరో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మైఖేల్ రాజు కి రీమేక్.

ఇలా కెరీర్ ప్రారంభం నుంచి వెంకటేశ్ రీమేక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా చేసిన సినిమాలే చంటి, చినరాయుడు, కొండపల్లి రాజా, రాజా, శీను లాంటి సినిమాలు తమిళ హిట్స్ నుంచి రీమేక్ చేసినవే. వీటిలో శీను భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకి శశి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. వెంకటేశ్ రీమేక్ చేసిన సినిమాలలో ‘శీను’ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కథ కథాంశం వెంకటేశ్ ఇమేజ్‌కి ఏమాత్రం సెట్ కాలేదు.

దర్శకుడు కథ విషయంలో పూర్తిగా తప్పటడుగు వేశాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆసక్తికరంగా సాగదు. ఇక క్లైమాక్స్ పెద్ద డిసప్పాయింట్. ఇలాంటి క్లైమాక్స్ అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎంతమాత్రం ఇష్టపడరు. ఇక అభిమానులు ఏ రకంగా ఇష్టపడతారు. కనీసం వెంకటేశ్ ముందు సినిమా రాజా అయినా ఒక సారి చూసి శీను కథలో మార్పులు చేర్పులు చేసి ఉండాల్సింది. ఇదే అభిప్రాయం అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తమయింది. ఆ తర్వాత నుంచి వెంకటేశ్ రీమేక్ సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలు తమిళ అసురన్ రీమేక్ నారప్ప, మలయాళ సూపర్ హిట్ దృశ్యం 2.



























