సిరిమల్లె పువ్వా..సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా..నా వాడు ఎవరే… నా తోడు ఎవరే.. అనే కోయిల లాంటి జానకి పాడిన ఈ పాట వింటే టక్కున శ్రీదేవి నటించిన పదహారేళ్ళ వయసు చిత్రం గుర్తుకు వస్తుంది. 1978 ఆగస్టు 31న పదహారేళ్ళ వయసు సినిమా విడుదలైంది. తమిళంలో భారతిరాజా దర్శకత్వం వహించిన “పదునారు వయనదిలే” చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు.

ఈ సినిమా వెనుక ఆసక్తికర విషయాలు ఏమిటంటే.. ఒక లారీ డ్రైవర్.. భారతీరాజా వద్దకు వచ్చి తను ఒక సినిమా నిర్మిద్దాం అనుకుంటున్నానని చెప్పడంతో.. తన దగ్గర ఒక మంచి కథ ఉందని..దానికి సుమారుగా మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని భారతీరాజా లారీ డ్రైవర్ కు చెప్పడం జరిగింది. కానీ ఆ లారీ డ్రైవర్ పోగు చేసుకున్న డబ్బు కేవలం మూడు లక్షలు కానీ సినిమాకి దాదాపుగా రూ.4.5లక్షల కంటే ఎక్కువగా ఖర్చయింది. అప్పుడు లారీ డ్రైవర్ తన సొంత లారీని, ఇతర ఆస్తిని అమ్మి ఆ సినిమా తీయడం జరిగింది.

కేవలం సినిమా మీద ఉన్న అభిమానంతో అంత మొత్తాన్ని ఆ లారీడ్రైవర్ ఆ సినిమాపై కర్చు చేశారు. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఎదురుచూస్తున్న సమయంలో.. మొదటగా డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో సినిమా ఘన విజయం సాధించింది. లారీ డ్రైవరు ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు రావడం, వివిధ భాషల నుంచి రీమేక్ హక్కులను ఇవ్వాలని నిర్మాతలు వెంటపడడం. అలాగే ఇన్ కమ్ టాక్స్ వాళ్లు రైడ్ చేయడం లాంటివి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎక్కడికో వెళ్లి ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది.

ఆ లారీడ్రైవర్ అడ్మిట్ అయినా ఆస్పత్రి చిరునామా తెలుసుకొని తెలుగు నిర్మాత మిద్దె రామారావు వెళ్లి ఆ రోజుల్లో ఒక సినిమాకి రైట్స్ కి కేవలం 40 వేల రూపాయలు ఇచ్చేవారు. కానీ మిద్దె రామారావు లక్ష రూపాయల కంటే ఎక్కువ చెల్లించి తమిళ మాతృక సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అడవిరాముడు సినిమా ఘనవిజయంతో ఉన్న కె.రాఘవేంద్రరావుని ఈ సినిమాకి నిర్మాతలు దర్శకుడిగా ఎన్నుకున్నారు. తెలుగులో తిరిగి శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకున్నారు.

కమల్ హాసన్ పాత్రకి చంద్రమోహన్ ని అదేవిధంగా రజినీకాంత్ పాత్రకి తిరిగి రజనీకాంత్ తెలుగులో నటిస్తానని ముందుకు వచ్చిన కూడా.. మోహన్ బాబునే ఎంచుకున్నారు. అయితే ఇంకో విషయం ఏమిటంటే పదహారేళ్ళ వయసులో చంద్రమోహన్ పాత్రను ముందుగా శోభన్ బాబు చేయాలనుకున్నారు. కానీ డిగ్లామర్ రోల్, పంచె, గోచి కట్టాల్సివస్తుందని శోభన్ బాబు పదహారేళ్ళ వయసు సినిమాని వదులుకున్నారు. ఈ సినిమాకి శ్రీదేవి 50 వేల రూపాయలు అడగగా..నిర్మాతలు 35 వేల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా చంద్రమోహన్ కి 17వేల రూపాయలు, మోహన్ బాబుకి 10 వేలరూపాయలు పారితోషికంగా ఇచ్చారు.

అయితే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన చక్రవర్తి తమిళ మాతృక నుంచి.. “సిరిమల్లె పువ్వా..సిరిమల్లె పువ్వా..”అనే హిట్ పాటని తీసుకున్నారు. మిగతా పాటలకి చక్రవర్తి సొంతంగా బాణీ కట్టారు. శ్రీదేవి అందం..చంద్రమోహన్ అమాయకత్వం.. మోహన్ బాబు క్రూరత్వం ఈ సినిమాకి చాలా దోహదపడ్డాయి. 1978 లో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు.


































