సినిమా ఇండస్ట్రీలో తమ్మారెడ్డి భరద్వాజా గురించి తెలియని వారుండరు. సినిమాలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆయన తప్పకుండా స్పందిస్తుంటారు. చిన్నా పెద్దా..అని తేడా లేకుండా.. ఎలాంటి పక్షపాతం చూపించకుండా ఆయన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంటారు. దర్శక, నిర్మాతగా ఎంతో పాపులర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఛానల్ కి ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. జార్జి రెడ్డితో మంచి రిలేషన్ కూడా ఉంది.

తమ్మారెడ్డి భరద్వాజ సినిమా ఇండస్ట్రీలో ముందు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవితో కోతల రాయుడు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహించారు. అప్పట్లో చిరంజీవితో సినిమా చేయాలంటే అంత సులభం కాదు. కానీ ఆయన మాత్రం నిర్మాతగా మొదటి సినిమాను చిరంజీవితో నిర్నించడం గొప్ప విషయం. ఆ సినిమా నుంచి చిరంజీవికి – తమ్మారెడ్డికి మంచి అనుబంధం ఏర్ప డింది. దాంతో వెంటనే ఇద్దరు కలిసి మరో సినిమాను చేయాలని డిసైడయ్యారు.

అలా చిరంజీవి – తమ్మారెడ్డి భరద్వాజ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా మొగుడు కావాలి. హిందీలో హిట్ అయిన ‘మంచాలికి’ అనే సినిమాకి అఫీషియల్ రీమేక్ గా నిర్మించారు. కట్టా సుబ్బారావు దీనికి దర్శకత్వం వహించారు. ఇదే క్రమంలో మరో కురుక్షేత్రం, ఇద్దరు కిలాడీలు సినిమాలు నిర్మించారు. సుమన్, భానుచందర్ లతో తీసిన ఈ మల్టీస్టారర్ హిట్ గా నిలిచింది. ఇలా నిర్మాతగా మంచి క్రేజ్ అండ్ ఫాంలో ఉన్న హీరోలతో సినిమాలు నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ ఆ తర్వాత దర్శకుడిగా మారాలనుకున్నారు. అలాగే స్వర్ణక్క సినిమాతో దర్శకుడిగా మారారు.

ఈ సినిమాకి ఆయన దర్శక, నిర్మాత. అప్పటి వరకు కమర్షియల్ సినిమాలు నిర్మించిన తమ్మారెడ్డి స్వర్ణక్క మాత్రం వేరే జోనర్ లో తీసి హిట్ అందుకున్నారు. మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించిన ఇందులో రోజా, దాసరి నారాయణ రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత పూర్తిగా దర్శకత్వం మీదే దృష్టి సారించారు. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, సినిమాలొచ్చాయి. రాజశేఖర్ తో వేటగాడు, శ్రీకాంత్, ఊహ జంటగా కూతురు వంటి సినిమాలు చేశారు.

చివరిగా పోతే పోనీ అనే సినిమా తీసిన తమ్మారెడ్డి ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఈ సినిమాకి నంది అవార్డ్ అందుకున్నారు. ఆయన సమర్పణలో పలాస 1978 సినిమా వచ్చింది. అయితే సూపర్ స్టార్ తో సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించిన తమ్మారెడ్డికి ఇపుడున్న స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వరన్న అభిప్రాయాన్ని ఓసారి వ్యక్తపరచారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. కథ కంటే హీరోయిజం మీదే సినిమాలు ఆడుతున్నాయి. నాకు సినిమాలు చేయాలని ఉంది. జూనియర్ ఎన్.టి.ఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళతో సినిమా చేయాలని ఉన్నా వాళ్ళు ఇప్పుడు నాకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు.



























